ఏపీ మాజీ స్పీకర్ కోడెలకు గుండెపోటు

  • Published By: madhu ,Published On : August 24, 2019 / 12:57 AM IST
ఏపీ మాజీ స్పీకర్ కోడెలకు గుండెపోటు

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. 2019, ఆగస్టు 23వ తేదీ శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేరిపించారు. కొత్తపేటలోని ఆయన అల్లుడు డాక్టర్‌ మనోహర్‌ నివాసంలో ఉండగానే కోడెల అస్వస్థతకు లోనయ్యారు. రాత్రి పదిన్నరకు  ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే ఐసీయూకి తరలించారు. ఊపిరి అందకపోవడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం తెలుసుకున్న నగరంలోని మరో ఇద్దరు హృద్రోగ నిపుణులు కూడా శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్డులోని లక్ష్మీ నర్సింగ్‌హోమ్‌కు చేరుకున్నారు. ఆయన, ఆయన కుటుంబ సభ్యులపై కొన్ని రోజులుగా చుట్టుముడుతున్న పలు వివాదాల నేపథ్యంలో మానసికంగా కొంత ఆందోళనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా ఆయన కుమారుడి షోరూమ్‌పై తనిఖీలు, అసెంబ్లీ ఫర్నిచర్‌ వ్యవహారంలో ఆయనపై ఆరోపణలు, అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం, ఆయన ఇంటి వద్ద ఇటీవల కొందరు దుండగులు చేసిన దాడులు… అన్నీ కలగలసి ఆయనను తీవ్ర ఆందోళనకు గురి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. 

గతకొన్ని రోజులుగా కోడెలపై పలు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు అక్రమాలు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేఎస్టీ పేరిట సత్తెపల్లి, నర్సరావుపేటలో వసూళ్ల పర్వం కొనసాగించారని సంచలనం సృష్టించింది. ఇటీవలే కోడెల కొడుకు చెందిన ద్విచక్ర వాహన షోరూంలో సైతం నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సీజ్ చేశారు అధికారులు. కేబుల్ వైర్ల ట్రాక్టర్లతో కోడెల నివాసం వద్ద కొంతమంది ధర్నాలు చేశారు.

అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్‌ను ఉపయోగించుకున్నట్లు కోడెల ఒప్పుకున్నారు. తాను తిరిగి ఇచ్చేస్తానని..లేకపోతే డబ్బైనా ఇస్తానని కోడెల వెల్లడించిన క్రమంలో దొంగతనం జరిగింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు వైసీపీ పార్టీకి చెందిన వారని కోడెల ఆరోపించారు. 
Read More : వైసీపీ కార్యకర్తలే మా ఇంట్లో చోరీకి వచ్చారు : ట్విస్ట్ ఇచ్చిన కోడెల