30 రోజుల్లో రూ.300 కోట్లు : అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సాయం

  • Edited By: veegamteam , January 3, 2019 / 10:41 AM IST
30 రోజుల్లో రూ.300 కోట్లు : అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సాయం

విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించి బాధితులకు సాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చింది. అటాచ్ కాని ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా హైకోర్టులో అఫిడవిట్ వేస్తామంటోంది. నెల రోజుల్లో 300 కోట్ల రూపాయల ఆస్తులు కొనుగోలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. 2019 జనవరి నెలాఖరుకి రూ.5వేల లోపు డిపాజిట్‌దారులకు చెల్లింపులు పూర్తి చేస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు తెలిపారు.
ఇంకా ఎన్నాళ్లు:
మూడున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ సమస్య నడుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచాయి. వెంటనే వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని కుటుంబరావు ఆరోపించారు. ఆస్తులు అటాచ్ చేయనివ్వకుండా, అమ్మనివ్వకుండా విపక్ష నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఏప్రిల్ వరకు వేలం అవ్వనికుండా అడ్డుకుంటామని వైసీపీ నేతలు అంటున్నారని ఆయన చెప్పారు.