ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు చెక్ : ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం

  • Published By: veegamteam ,Published On : August 28, 2019 / 02:43 PM IST
ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు చెక్ : ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నారా.. ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తున్నారా.. హెల్మెట్, సీటు బెల్ట్ లేకుండా వాహనం నడుపుతున్నారా.. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తున్నారా..అయితే మీ చేతిలోని స్మార్ట్‌ ఫోన్‌తో ఫొటో తీసి ఏపీ రవాణా శాఖ అందుబాటులోకి తీసుకురానున్న ఫోన్‌ నంబర్‌కు వాట్సప్‌ చేస్తే చాలు. వెంటనే రవాణా శాఖ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు రంగంలోకి దిగి వారిపై చర్యలు తీసుకుంటారు.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. పౌర భాగస్వామ్యంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడేవారికి  ముకుతాడు వేసేందుకు రెడీ అవుతోంది. 2019, సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి వినూత్న ప్రయోగాన్ని అమలు చేయనుంది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కనిపిస్తే ఉపేక్షించకుండా ఫొటో తీసి రవాణాశాఖకు పంపవచ్చని తెలిపింది. ఇందుకోసం రవాణాశాఖ ప్రత్యేక వాట్సాప్ నెంబర్ 9542800800 కేటాయించింది. నిబంధనలు ఉల్లంఘించినవారి ఇంటికే జరిమానా పంపుతామని అధికారులు తెలిపారు. చలాన్లు కట్టనవారి లైసెన్స్ రద్దు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

అయితే ఫొటోలో వాహన నంబర్‌ స్పష్టంగా కనిపించేలా జాగ్రత్త వహించాలి. ఈ ఫొటోలను రవాణా శాఖ ఎన్‌ఫోర్సుమెంట్‌ బృందాలు పరిశీలించి, వాహన నంబర్‌ ఆధారంగా వాహనదారుడి అడ్రస్‌కు నేరుగా చలానా పంపుతాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోల్ని ఆయా జిల్లాల రవాణా శాఖ అధికారులకు పంపి ఉల్లంఘనలకు పాల్పడేవారికి ముకుతాడు వేయనున్నారు.

పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి, లైసెన్సు రద్దు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించనున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాతో కూడిన చలానాలు నేరుగా ఇంటికే రానున్నాయి. ప్రజలను నేరుగా భాగస్వాములను చేయడం ద్వారా ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘటనకు పాల్పడేవారికి కళ్లెం వేయడం సులభమవుతుందని రవాణా శాఖ భావిస్తోంది.

Also Read : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు : దేశంలో కొత్తగా 75 మెడికల్ కాలేజీలు