అందరికీ ఆరోగ్యం.. ఆరోగ్యశ్రీ పథకం: రూ. వెయ్యి దాటితే వైద్యం ఉచితం.. ప్రభుత్వం ఉత్తర్వులు

  • Published By: vamsi ,Published On : January 1, 2020 / 02:54 AM IST
అందరికీ ఆరోగ్యం.. ఆరోగ్యశ్రీ పథకం: రూ. వెయ్యి దాటితే వైద్యం ఉచితం.. ప్రభుత్వం ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన పథకం ఆరోగ్యశ్రీ. రాష్ట్ర పౌరులకు తెల్ల రేషన్ కార్డు పరిధిలోకి వచ్చే వ్యక్తుల వైద్యానికి ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో జనవరి 3వ తేదీ నుంచి దీనిని అమలు చేయనుంది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళ్లే రోగుల వైద్యం ఖర్చు వెయ్యి దాటితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఖర్చు వెయ్యి దాటే శస్త్రచికిత్సలు వెయ్యి మాత్రమే ఉన్నాయని అధికారులు గుర్తించారు. దీంతో ఆ వెయ్యి ప్రొసీజర్స్‌ను మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. జీవోలో కూడా ఆ వెయ్యి శస్త్రచికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీలో వైద్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కూడా 780చికిత్సలు ఇన్‌పేషంట్స్‌కు వర్తిస్తాయి. 220 మాత్రమే అవుట్‌ పేషెంట్స్‌కు వర్తించేలా ఉన్నాయి.

ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 1059 శస్త్ర చికిత్సలకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. లేటెస్ట్‌గా విడుదలైన ఉత్తర్వుల ప్రకారం వాటికి అదనంగా మరో వెయ్యి అమలులోకి రానున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ఈనెల 3 నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా 2059 రకాల చికిత్సలు పొందవచ్చు. మిగిలిన 12 జిల్లాల్లో కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అమలు చేస్తున్న ప్రొసీజర్లను పెంచింది.

ప్రస్తుతం అమలు చేస్తున్న 1059 ప్రొసీజర్లతో పాటు మరో 200 ప్రొసీజర్లను మిగిలిన 12 జిల్లాల రోగుల అందుబాటులోకి తీసుకువస్తుంది. వీటిని కూడా ఈనెల 3 నుంచి మిగిలిన 12 జిల్లాల్లో అమలు చేయనున్నారు. అంటే పశ్చిమగోదావరి 2059 ప్రొసీజర్స్‌ అమలైతే మిగిలిన జిల్లాల్లో 1259 చికిత్సలను అనుమతిస్తుంది ప్రభుత్వం.