అభ్యర్థుల అడ్డదారులు : ఏపీలో పట్టుబడిన రూ. 106 కోట్లు

  • Published By: madhu ,Published On : April 8, 2019 / 12:57 AM IST
అభ్యర్థుల అడ్డదారులు : ఏపీలో పట్టుబడిన రూ. 106 కోట్లు

పోలింగ్‌కు మరో మూడు రోజులే సమయం..ఇంకేముంది.. ప్రలోభాల పర్వం స్టార్ట్ అయ్యింది. అభ్యర్థులు తాము గెలవడమే లక్ష్యంగా వక్రమార్గం పడుతున్నారు. అడ్డదారులూ తొక్కుతున్నారు. నోట్ల కట్టలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. అంతేకాదు..నగదు, మద్యం, బహుమతులు, చీరలు, రకరకాల వస్తువులతో వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 22 లక్షల 58వేల నగదు దొరికింది. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు కూడా నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన వారిగా గుర్తించారు. 
నెల్లూరు జిల్లా ఏఎస్‌ పేట మండలం అనుమసముద్రం దగ్గర మరో 14 లక్షల నగదు పట్టుబడింది. ఇన్నోవా కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మర్రిపాడు మండలం కంపసముద్రంలోని ఓ ఇంట్లో దాచి ఉంచిన 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా ఎమ్‌ఆర్‌ పేటలో ఓటర్లకు స్లిప్పులతోపాటు నగదును పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 19వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తుని పట్టణంలోని స్థానిక రామా థియేటర్‌ సెంటర్‌లో ఎన్నికల నిఘా బృందం నిర్వహించిన తనిఖీల్లో 70వేల నగదు పట్టుబడింది. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు సీజ్‌ చేశారు. ఇక మండపేటలో ఓటర్లకు డబ్బులు పంచుతున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 లక్షల 14వేల 900 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లాలోనూ నగదు భారీగా పట్టుబడింది. ప్రొద్దుటూరులో 13 లక్షల 87వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొర్రపాడు రోడ్డులో పత్తిమిల్లులో  పనిచేస్తున్న కొప్పారపు రమేష్‌ నుంచి 9 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  ప్రకాశ్‌నగర్‌లో ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్న 4 లక్షల 85వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 
అనంతపురం జిల్లా గుత్తి మండలంలో జనసేన అభ్యర్థి మధుసూదన్‌ గుప్తా తరపున ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా నాతవరంలో రాజు అనే వ్యక్తి వైసీపీ తరపున ఓటర్లకు డబ్బులు పంచుతూ పోలీసులకు చిక్కాడు. ఇతడి నుంచి లక్షా 30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
* నగదుతో పాటు ఏపీలో మద్యం కూడా ఏరులై పారుతోంది.
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరులోని సుబ్రహ్మణ్యం ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 572 మద్యం బాటిళ్లను ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీమ్ స్వాధీనం చేసుకుంది. వాకాడు మండలం కొండాపురం సమీపంలో 506 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 2,113 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.  ఏడుగురిపై కేసు నమోదు చేశారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 కేసుల మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.  ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో భారీగా మద్యం పట్టుబడింది. గుడివాడ నుంచి ఆటోలో మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తరలిస్తున్న 3వేల 264 మద్యం సీసాలను గుర్తించారు. డ్రైవర్‌ను  అదుపులోకి తీసుకుని మద్యాన్ని సీజ్‌ చేశారు.
ఏపీలో ఇప్పటి వరకు 106 కోట్ల నగదు పట్టుబడినట్టు ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ తెలిపారు. 22 కోట్ల విలువైన మద్యాన్ని సీజ్‌ చేసినట్టు తెలిపారు. పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని 14 పోలింగ్‌ బూత్‌లను విలీనం చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.