సైలెంట్‌గా నిమ్మగడ్డ.. కారణం ఏంటీ? తుఫాను ముందు ప్రశాంతతేనా?

10TV Telugu News

ఏపీలో ఓ వైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మరోవైపు మున్సిపోల్స్‌కు నోటిఫికేషన్‌ వచ్చేసింది. గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ నేతలంతా బిజిబిజీ అయిపోయారు. విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ మాటల తుటాలు పేల్చేవారు కొందరూ.. మొత్తంగా ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హీట్‌.. థర్మామీటర్‌ పగిలిపోయేలా ఉంది.. కానీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ మాత్రం చాలా కూల్‌గా పనిచేసుకుంటున్నారు.

ప్రెస్‌మీట్లు, గవర్నర్‌తో భేటీలు, అధికారులకు హెచ్చరికలు, మంత్రులకు నోటీసులు, కేంద్రానికి లేఖలు, కోర్టుల్లో కేసులు.. ఇలా నిత్యం బిజీగా ఉండే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. గత రెండు రోజులుగా సైలెంట్‌ అయిపోయారు.. రాజకీయాలు, మీడియాకు దూరంగా… కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వస్వామి సన్నిధిలో కాలం గడుపుతున్నారు..

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ విడుదల చేసిన నిమ్మగడ్డ.. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సమయంలో అలాంటి హడావుడి చేయలేదు.. కనీసం నోటిఫికేషన్‌ విడుదల సమయంలో అమరావతిలో కూడా లేకుండా.. తిరుపతిలో ఉండి మున్సిపోల్స్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న నిమ్మగడ్డ.. అప్పటి నుంచి తిరుమల కొండపైనే మకాం వేశారు. స్వామి వారి సేవలో సేద తీరుతున్నారు.. ఇప్పటివరకు రెండు సార్లు స్వామి వారిని దర్శించుకున్నారు. అంతేకాదు.. తిరుమల కొండల్లోని అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా చేశారు..

ఇంతకు ముందు ఆయన పర్యటనలకు.. ఈ పర్యటనకు చాలా మార్పు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు… ఇంతకు ముందు రాయలసీమ, ఉత్తరాంధ్రలో పర్యటించారు నిమ్మగడ్డ.. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ.. ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేసేవారు.. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు.. స్వామివారి దర్శనం, మానసికోల్లాసం కోసం ట్రెక్కింగ్‌.. తిరిగి అతిథి గృహానికి చేరుకొని విశ్రాంతి తీసుకోవడం.. అంతకుమించి నిమ్మగడ్డ ఎవరినీ కలవట్లేదు.. మీడియాతో కూడా మాట్లాడట్లేదు.

అసలు నిమ్మగడ్డ ఉన్నట్టుండి ఇంత మౌనం వహించడానికి కారణాలేంటి అన్న ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చిస్తుండగా.. రిటైర్ అవుతున్న సమయంలో వివాదాలు ఎందుకని అనుకుంటున్నారా? లేక మొదటి రెండు విడతల్లో జరిగిన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగాయన్న సంతృప్తిలో ఉన్నారా? లేక దైవ సన్నిధిలో ఉన్నప్పుడు రాజకీయాలేందుకు అనుకుంటున్నారా? లేక ఇది తుఫాన్‌ ముందు ప్రశాంతాతా? మొత్తానికి విషయం ఏదైనా నిమ్మగడ్డ సరళి మాత్రం కాస్త ఆసక్తికంగానే ఉంది.