‘రహానె వ్యూహం అద్భుతం’.. ఆసీస్‌ మాజీ క్రికెటర్ ప్రశంసలు

‘రహానె వ్యూహం అద్భుతం’.. ఆసీస్‌ మాజీ క్రికెటర్ ప్రశంసలు

ajinkya-rahane

Australia Former wicketkeeper Brad Haddin praises Ajinkya Rahane : సిడ్నీ టెస్టులో టీమిండియా సారథిగా అజింక్య రహానె వ్యూహాలు చాలా బాగున్నాయని ఆసీస్‌ మాజీ వికెట్‌కీపర్‌ బ్రాడ్‌ హడిన్‌ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్‌ను ముందుగా పంపించడంతో భారత్‌ సులువుగా మ్యాచ్‌ను డ్రా చేయగలిగిందని ప్రశంసించాడు. మూడో టెస్టు డ్రా కావడంతో సిరీస్‌ 1-1తో సమంగా ఉన్న సంగతి తెలిసిందే. ‘టీమ్‌ఇండియా నాలుగో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడింది. కేవలం డ్రా కోసం కష్టపడాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు పంత్‌ను ముందుగా పంపించాలన్న రహానె తెలివితేటలు అద్భుతం’ అని హడిన్‌ అన్నాడు.

దూకుడుగా ఆడిన పంత్‌ 97 పరుగులు చేసి జింక్స్‌ నమ్మకాన్ని నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ‘రిషభ్‌ను ముందు పంపించి ఆటను ముందుకు తీసుకెళ్లాలని రహానె భావించాడు. పంత్‌ అలాగే చేశాడు. నిర్భయంగా ఆడి టిమ్‌ పైన్‌ కొన్ని నిర్ణయాల్లో మార్పులు చేసుకొనేలా ఆడాడు. అందుకే రహానె వ్యూహం గొప్పదని అంటున్నా’ అని హడిన్‌ తెలిపాడు.

‘ఆ తర్వాత విహారి వచ్చాడు. అతడూ పుజారాలాంటి ఆటగాడే. వాళ్ల స్వభావం ఆటను ముగించడం. వారు అచ్చం అలాగే చేశారు. రహానె సారథిగా ఒక్క మ్యాచూ ఓడిపోలేదు. టీమ్‌ఇండియాకు సిడ్నీలో అతడు ధైర్యాన్ని నూరిపోశాడు. ఆటగాళ్లు గాయాలపాలైనా పట్టుదలతో ఆడాడు. వారిలోని అంకితభావాన్ని ప్రదర్శించారు. వాళ్ల కెప్టెన్‌ లేడు. ముగ్గురు పేసర్లు మధ్యలోనే వెళ్లిపోయారు. జడేజా వేలు విరిగింది. అయినా వారు నిర్భయంగా క్రికెట్‌ ఆడారు’ అని హడిన్‌ తెలిపారు.