బండ్ల గణేష్ కు బెయిల్

  • Published By: veegamteam ,Published On : October 24, 2019 / 01:46 PM IST
బండ్ల గణేష్ కు బెయిల్

చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ లభించింది. కడప మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో బండ్ల గణేష్ కడప నుంచి హైదరాబాద్ వచ్చేశారు. బాధితులతో బండ్ల గణేష్ తరఫు లాయర్ చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించాయి. బాకీ సొమ్ములో ప్రస్తుతం బండ్ల గణేష్ రూ.4లక్షలు చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని నవంబర్ 14న చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత గణేష్ తరఫు లాయర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం.. బెయిల్ ఇవ్వడం జరిగిపోయాయి. బండ్ల గణేష్ పై కడప, ప్రొద్దుటూరులో చెక్ బౌన్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

నిన్న సాయంత్రం బండ్ల గణేష్ సినీ ఫక్కీలో అరెస్ట్ అయ్యారు. బండ్ల తనను బెదిరించారని నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నోటీసులు అందుకోవడానికి బండ్ల గణేష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అదే సమయంలో రూ.10 లక్షల చెక్ బౌన్స్ కేసులో కడప కోర్టులో ఆయనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు బండ్లను అరెస్ట్ చేశారు. గురువారం(అక్టోబర్ 24,2019) ఉదయం కడప జిల్లా కోర్టులో బండ్లను పోలీసులు హాజరుపరిచారు. కోర్టు బండ్లకు 14 రోజుల రిమాండ్ విధించింది.

కడప వ్యాపారి మహేశ్‌కు చెందిన లాయర్‌కు.. బండ్ల గణేష్ తరఫు లాయర్.. రూ.4 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బు.. ఇచ్చేందుకు కొంత సమయం అడిగారు. అంతకుముందు.. బండ్ల గణేష్ కు బెయిల్ ఇవ్వొద్దంటూ వాదించిన వ్యాపారి మహేశ్ లాయర్.. కొంత డబ్బు తిరిగివ్వడంతో.. వెనక్కి తగ్గారు.

బండ్ల గణేశ్.. సినీ నిర్మాతగా ఎంత ఫేమస్సో.. వివాదాల్లోనూ.. కోర్టు కేసుల్లోనూ అంతే ఫేమస్. కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గణేష్.. మూవీ ప్రొడ్యూసర్‌గా అంతకంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. కానీ.. కేసులు, వివాదాల కేటగిరిలో.. ఇండస్ట్రీలో బండ్ల గణేష్ పేరే ఎక్కువగా వినిపిస్తుంటుంది. అలా.. థియేటర్ లో సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే బండ్ల.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చారు. కేసు పాతదే అయినా.. ఇప్పుడు కొత్తగా అరెస్టయ్యారు. అందుకే.. బండ్ల మళ్లీ వార్తల్లోకెక్కారు. తీసింది సింగిల్ డిజిట్ సినిమాలే అయినా.. బండ్ల గణేష్ స్టార్ ప్రొడ్యూసర్ లిస్టులో చేరిపోయారు. కానీ.. ఆ పాపులారిటీ ఎక్కువకాలం నిలుపులేకపోయారు.

కేవలం.. రూ.10 లక్షల చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ అడ్డంగా బుక్కయ్యారు. ఈ వ్యవహారమంతా.. క్లియర్‌గా అర్థమవ్వాలంటే.. క్యాలెండర్ వెనక్కి తిప్పి.. 2014కు వెళ్లాలి. ఆ టైంలో.. కడపకు చెందిన మహేశ్ అనే వ్యాపారి.. బండ్ల గణేశ్‌కు 10 లక్షలు అప్పు ఇచ్చాడు. వాటిని తిరిగి చెల్లించే క్రమంలో గణేష్ చెక్కు ఇచ్చాడు. అది కాస్తా.. బౌన్స్ కావడంతో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. దీంతో.. మహేశ్ కడప పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై.. కడప కోర్టులో నాలుగున్నరేళ్లుగా కేసు కొనసాగుతోంది. కోర్టు సమన్లు పంపినా.. గణేష్ ఒక్కసారి కూడా న్యాయస్థానం ఎదుట హాజరుకాలేదు. దీంతో.. న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గణేష్ ను అరెస్ట్‌ చేసి హాజరుపరచాలని.. బంజారాహిల్స్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది.

సినిమాలు తీసుకునే బండ్ల గణేష్.. సినీ ఫక్కీలోనే అరెస్టయ్యారు. ఆయనకు అర్థమయ్యేలోపే.. అంతా జరిగిపోయింది. తన డైలాగులతో అందరూ షాకయ్యేలా చేసే గణేష్.. పోలీసులిచ్చిన ట్విస్ట్‌తో స్వయంగా షాకయ్యాడు. ఈ చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అవడానికి కొన్నాళ్ల ముందు.. బండ్ల గణేష్.. మరో నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ను బెదిరించారు. ఈ కేసులో.. నోటీసులు తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లారు. ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకొచ్చింది. చెక్ బౌన్స్ కేసులో.. గణేష్ ను అరెస్ట్ చేయాలని కడప కోర్టు నుంచి ముందే బంజారాహిల్స్ పోలీసులకు ఆదేశాలు అందాయి. జూబ్లీహిల్స్ పీఎస్‌కు.. బండ్ల గణేష్ వస్తున్నాడని తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. అప్పటికే అక్కడకు చేరుకుని.. గణేష్ ను అరెస్ట్ చేశారు. ఈ ట్విస్ట్‌తో.. బండ్ల గణేష్ కంగుతిన్నారు.