స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న బాలయ్య అల్లుడు

  • Published By: chvmurthy ,Published On : March 19, 2019 / 08:26 AM IST
స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న బాలయ్య అల్లుడు

విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్ధి, నందమూరి బాలకృష్ణ అల్లుడు ఎం శ్రీభరత్ మంగళవారం(మార్చి-18,2019) విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. సోమవారం రాత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భరత్ కు విశాఖ ఎంపీ టికెట్  కేటాయించారు. మంగళవారం ఉదయం భరత్, శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించి, స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు  

నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె  తేజస్వి భర్త అయిన శ్రీ భరత్…గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎంవీవీఎస్ మూర్తికి మనుమడు. శ్రీభరత్ ప్రస్తుతం గీతం విద్యాసంస్థల అధిపతిగా కొనసాగుతున్నారు.విశాఖపట్టణం ఎంపీ స్థానం నుండి గతంలో రెండు పర్యాయాలు ఎంవీవీఎస్ మూర్తి ఎంపీగా పనిచేశాడు. గత ఏడాది అమెరికా పర్యటనలో ఉన్న సమయంలోనే ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందిన విషయం తెలిసిందే.

విశాఖ టిక్కెట్‌ను తన చిన్నల్లుడికి ఇప్పించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుపై నందమూరి బాలకృష్ణ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు రెండ్రోజుల క్రితం ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో భరత్ పేరు తెరమీదకు వచ్చినా…పార్టీ టిక్కెట్ సాధించడంలో సఫలీకృతమయ్యారు. విశాఖ జిల్లా టీడీపీ నేతలు కూడా శ్రీభరత్ వైపే మొగ్గుచూపారు.  విశాఖ టిక్కెట్‌ను శ్రీభరత్‌కు ఇవ్వాలని వారు పార్టీ అధిష్టానానికి సూచించారు. స్థానిక నేతలు కూడా భరత్ వైపే మొగ్గుచూపడంతో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ విశాఖ టిక్కెట్‌ను శ్రీభరత్ సొంతం చేసుకున్నాడు.
నందమూరి బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేశ్ ఏపీ మంత్రిగా ఉన్న తెలిసిందే. ఇప్పుడు ఆయన చిన్నల్లుడు శ్రీభరత్ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం విశేషం.సినీ నిర్మాత-రియల్టర్ అయిన వైసీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణతో ఈ ఎన్నికల్లో శ్రీభరత్ తలపడనున్నారు.
Read Also : టీడీపీకి నామా రాంరాం : లైవ్ లోనే కండువా తీసేశాడు