వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

  • Published By: chvmurthy ,Published On : September 28, 2019 / 02:56 PM IST
వైభవంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

హన్మకొండలోని ప్రఖ్యాత వేయి స్తంభాల గుడిలో బతుకమ్మ సంబరాలు  సెప్టెంబరు28, శనివారం సాయంత్రం వైభవంగా  ప్రారంభమయ్యాయి.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో   నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పర్యాటక శాఖామంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. దాదాపు 10 వేల మంది మహిళలతో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకలు నేటితో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 

తొమ్మిది రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ఉత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బతుకునిచ్చే బతుకమ్మే మన సాంప్రదాయ పండుగ. ఈ వేడుకను తెలంగాణలో ఎప్పట్నుంచో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. 

బతుకమ్మను అందరూ కొలవాలనీ, రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉండేలా ప్రార్థించాలని మంత్రి ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, మహిళా కార్పోరేషన్‌ చైర్మన్‌ గుండు సుధారాణి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.