బీజేపీలో చేరిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్‌.. బైరెడ్డి కూడా!

  • Published By: vamsi ,Published On : November 29, 2019 / 09:21 AM IST
బీజేపీలో చేరిన బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశల్‌.. బైరెడ్డి కూడా!

మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 విన్నర్‌ కౌశల్‌ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బైరెడ్డి కుమార్తె ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ శబరి, కౌశల్‌ సతీమణి నీలిమ బీజేపీలో చేరారు.

టీడీపీ నుంచి తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తరువాతి కాలంలో టీడీపీకి రాజీనామా చేసి రాయలసీమ పరిరక్షణ సమితి పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంటుకు పోటీ చెయ్యాలని భావించారు. కానీ కుదరలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.

కానీ టిక్కెట్ హామీ దొరకకపోవడంతో 2018 లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అక్కడా ఇమడలేక సరిగ్గా 2019 సాధారణ ఎన్నికలకు పదిరోజుల ముందే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి చివరకు టీడీపీలో చేరారు. ఇక బిగ్ బాస్ 2 టైటిల్ విన్ అయిన తర్వాత చంద్రబాబును కలిసి టీడీపీకి సపోర్ట్ చేసిన కౌశల్ రాజీకీయాల్లో కాస్త ఇంట్రస్ట్ ఉన్నారు. అయితే పార్టీలో మాత్రం చేరలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీ కండువా కప్పుకుని ఆ పార్టీలో చేరారు.

ఈ సంధర్భంగా మాట్లాడిన బైరెడ్డి, రాయలసీమ అభివృద్ధి చెందాలంటే బీజేపీతోనే సాధ్యం అని నమ్ముతున్నట్లుగా చెప్పారు. దేశంలో పరిస్థితులు బాగుపడాలంటే ప్రధాని నరేంద్ర మోడీ నిస్వార్థ రాజకీయాలు అవసరం అని అభిప్రాయపడ్డారు. అందుకోసమే తాను బీజేపీలో చేరారని వెల్లడించారు. త్వరలోనే కర్నూలులో బహరింగ సభ నిర్వహిస్తామని, ఆ సభకు రావాల్సిందిగా జేపీ నడ్డాను కోరినట్టు వెల్లడించారు.

కౌశల్‌ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాలు దేశం కోసం పనిచేస్తున్న తీరు ఆకట్టుకుందని, వారి నాయకత్వంలో పనిచేయడం కోసం బీజేపీలో చేరినట్టు స్పష్టం చేశారు.