65ఏళ్ల మహిళకు 18 నెలల్లో 8 మంది పిల్లలు..!!

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 11:50 AM IST
65ఏళ్ల మహిళకు 18 నెలల్లో 8 మంది పిల్లలు..!!

ఒక మహిళ గర్భం ధరించి బిడ్డకు జన్మనివ్వాలంటే 9 నెలలు పడుతుంది. కానీ ఎంత అద్భుతం జరిగినా..ఎంత అతిశయోక్తిగా మాట్లాడుకున్నా ఓ మహిళ అందునా 65 ఏళ్లు ఉన్న మహిళ 18 నెలల్లో ఏకంగా 8మంది బిడ్డలకు జన్మనిస్తుందా? కవలపిల్లలు పుట్టి ఉంటే అది జరగొచ్చు.



కానీ మామూలుగా అయితే అది ఎంత మాత్రం సాధ్యం కాదు. కానీ అలా ఓ మహిళ కేవలం 18 నెలల్లో 65 ఏళ్ల మహిళ 8మందికి పిల్లలకు జన్మనిచ్చిందని బీహార్ ప్రభుత్వం రికార్డుల్లో కనిపిస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా ఉన్న జాతీయ ప్రసూతి ప్రయోజన పథకంలో పనితీరుకు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. (ఎన్ఎం‌బీఎస్)లో జరుగుతున్న అక్రమాలకు ఇది నిలువెత్తు సాక్ష్యంగా డబ్బులు చక్కగా దండుకుంటున్నారు అధికారులు.

జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగితే ప్రోత్సాహకంగా ఎన్ఎంబీఎస్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా సదరు మహిళకు రూ. 2 వేలు ఇస్తారు. ఇందులో రూ. 1400 తల్లికి ఇవ్వగా, మిగతా రూ. 600ను ఆమెకు తోడుగా ఉన్న ఆశ కార్యకర్తకు ఇస్తారు. దీన్ని ఆసరగా చేసుకున్న అక్రమార్కులు ఈ నిధుల్ని కాజేయటానికి ముజఫర్‌పూర్‌లో చోటి కొతియా గ్రామానికి చెందిన లీలాదేవి అనే 65 ఏళ్ల మహిళకు జరిగిన ప్రసవాల లెక్కలను చూపించి డబ్బులు దండుకున్నారు అక్రమార్కులు. లీలాదేవికి నలుగురు సంతానం. 21 ఏళ్ల కిందట ఆమె తన నాలుగో సంతానానికి జన్మనిచ్చింది.



కానీ లీలాదేవి ఏడాదిన్నరలో అంటే 18 నెలల్లో 8 మంది పిల్లలను కన్నట్లు అధికారుల రికార్డుల్లో రాసి పారేశారు. దానికోసం వచ్చిన ప్రోత్సాహక డబ్బును దిగమింగేశారు. విషయం తెలిసిన లీలాదేవి తన ఖాతా ఉన్న కస్టమర్‌ సర్వీసు పాయింట్‌కు వెళ్లి నిలదీసింది. దీంతో తమ బండారం బైటపడిపోతుందని భయపడిన అధికారులు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం..కానీ ఫిర్యాదు చేయవద్దంటూ కోరారు. అక్కడితో ఆగలేదు వారి అక్రమాలు శాంతిదేవి అనే మరో 66 ఏళ్ల మహిళ కేవలం 10 గంటల వ్యవధిలో ఇద్దరికి జన్మనిచ్చినట్లు కూడా రాసిపడేశారు.ఆ డబ్బుల్ని మింగేశారు.



అలా లీలాదేవి గ్రామం అయిన చోటీకొతియా గ్రామానికి చెందిన సబీనా ఖాతూన్ అనే 56 ఏళ్ల మహిళ పేరుతో కూడా అక్రమాలను పొడిగించారు. ఇలా 50 మందికి పైగా మహిళల పేరిట డబ్బు కాజేసినట్లు తేలడంతో కలెక్టర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ దానికి సంబంధంచిన వారిపై విచారణకు ఆదేశించారు.

ఇలా పురిటి వాసనలపై వాలే గుంటనక్కల్లా..బిడ్డల పుట్టుకలను ప్రోత్సహించే నిధుల్ని సైతం వదలకుండా మింగేస్తున్నారు అక్రమార్కులు. దేవుడు వరం ఇచ్చినా పూజారి ఇవ్వడు అన్నట్లుగా ప్రభుత్వాలు ఇస్తున్న డబ్బుల్ని మధ్యలో ఉండే అధికారులే ఇలా మింగేస్తుంటే ఇక పేదలకు ఇంకెక్కడ అందుతాయి సంక్షేమ పథకాలు. ఇలా సంక్షేమ పథకాల పేరుతో జరిగే అక్రమాలు ఎన్నో..ఎన్నెన్నో. అవన్నీ బైటపడితే అవినీతి బొక్కసాల్లో దాక్కున్న అధికారుల సంఖ్య లెక్కపెడితే ఇది భారతదేశమా?.అవినీతి దేశమా అని ముక్కన వేలేసుకోవాల్సి వస్తుంది.