బీజేపీ ఎన్నికల ఖర్చు రూ. 90 వేల కోట్లు

  • Published By: veegamteam ,Published On : April 1, 2019 / 04:16 AM IST
బీజేపీ ఎన్నికల ఖర్చు రూ. 90 వేల కోట్లు

ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ  ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఆరోపించారు. 
 

అంతేకాదు దేశ వ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ చేసే ఖర్చు రూ.లక్ష కోట్లు దాటే అవకాశముందని..దీంట్లో 90 శాతం బీజేపీ పార్టీ చేసే ఖర్చేనని ఆయన ఆరోపించారు. భారత్ లో ఎన్నికలు డబ్బుతోనే నడుస్తున్నాయని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలలో దాదాపుగా అన్ని పార్టీలు అడ్డూ అదుపు లేకుండా ఖర్చు చేస్తున్నాయని..ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు వచ్చే నిధులపై పారదర్శకత పాటించాలని..ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లో రాజకీయ పార్టీలకు ఎలక్ట్రోరల్‌ బాండ్ల రూపంలో కార్పొరేట్లు, విదేశాల నుంచి నిధులు అక్రమంగా అందుతున్నాయని అన్నారు. ఎన్నికలలో మంచి అభ్యర్థుల కంటే గెలిచే అభ్యర్థులకే ప్రజలు పట్టం కడుతున్నారని..ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన సూచించారు. 

బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదం
ఐదేండ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని..న్యాయవ్యవస్థ, సీబీఐ, కాగ్‌, సీవీసీ, ఆర్బీఐ, ఎన్నికల కమిషన్‌ వంటి స్వతంత్ర సంస్థల స్వయం ప్రతిపత్తి ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. గతంలో లేని విధంగా  ఎన్నికల తేదీలను ప్రభుత్వం తనకు అనుకూలంగా ప్రకటించుకుందని..దీని కోసం గుజరాత్‌ నుంచి తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని తమకు అనుకూలంగా వ్యవరించేలా చేసుకుంటున్నారని విమర్శించారు.