బోటు ప్రమాదం : విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

  • Edited By: veegamteam , September 15, 2019 / 02:04 PM IST
బోటు ప్రమాదం : విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

తూర్పుగోదావరి జిల్లాలో బోటు ప్రమాద ఘటనపై విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాపికొండల టూర్ కు ఎవరైనా వెళ్లి ఉంటే వివరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ కోరారు. 180042500002 నెంబర్ కు ఫోన్ చేయాలని కలెక్టర్ చెప్పారు. విశాఖ నుంచి రమణబాబు కుటుంబం భద్రాచలం టూర్ కు వెళ్లింది. నలుగురు చిన్నారులు సహా 9 మంది టూర్ కు వెళ్లారు. 

రమణబాబు కుటుంబం ఉదయం 4 గంటలకు రాజమహేంద్రవరం వెళ్లింది. భద్రాచలం వెళ్లేందుకు బోటు ఎక్కుతున్నట్లు రమణబాబు తెలిపారు. అయితే బోటు ప్రమాదం తర్వాత ఫోన్ కలవకపోవడంతో ఆందోళన ఏర్పడింది. రమణబాబు, అరుణకుమారి, అప్పలనర్సమ్మ, వైష్ణవి, అనన్య, అభిషేక్, కుషాలి, పుష్ప గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ రమణబాబు బంధువు కలెక్టరేట్  కు వచ్చారు.

తూర్పుగోదావరి జిల్లా కచులూరు దగ్గర గోదావరిలో జరిగిన పర్యాటక బోటు ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. 40 మంది గల్లంతయ్యారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు 61, బోటు సిబ్బంది 10 ఉన్నారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. 

సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం పాపికొండలకు వశిష్ట బోటు బయలుదేరింది. ఉదయం 10.30గంటలకు పోచమ్మ గండి నుంచి బయలుదేరింది. కచ్చులూరు దగ్గర గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. వెనక్కి తీస్తుండగా రాయికి తగిలి బోటు తిరగబడినట్లు సమాచారం.

Also Read : బోటు ప్రమాదం : తెలంగాణ వాసుల మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం కేసీఆర్