వీకెండ్స్‌లో విహార యాత్రలు : టూరిస్టుల్లో సండే టెన్షన్

  • Published By: madhu ,Published On : September 16, 2019 / 01:02 AM IST
వీకెండ్స్‌లో విహార యాత్రలు : టూరిస్టుల్లో సండే టెన్షన్

ఆదివారం వస్తోందంటే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సరదాగా టూర్ ప్లాన్ చేస్తారు. కానీ.. ఇప్పుడు అమ్మో ఆదివారం అనే పరిస్థితి ఏర్పడుతోంది. ఎందుకంటే… సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద జరిగిన ప్రమాదంతో సహా.. ఇటీవల జరిగిన పడవ మునక సంఘటనలు ఎక్కువగా ఆదివారం జరిగినవే కావడమే.

ఆదివారం అంటేనే హడలిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కచ్చులూరు ఘటన జరిగింది ఆదివారం రోజే. వీకెండ్‌ను సరదాగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా బోటు రూపంలో ప్రమాదం ఎదురైంది. పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఒక్క ప్రమాదమే కాదు గతంలో కూడా కొన్ని ప్రమాదాలు ఆదివారమే జరిగాయి. కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ప్రమాద ఘటనల్లో ఆదివారం రోజునే ఎక్కువ ఉన్నాయి. 

>  2017 నవంబర్ 12 ఆదివారం.. కార్తీక మాసం. విజయవాడ సమీపంలో పవిత్ర సంఘం దగ్గర కృష్ణా నదిలో బోటు ప్రమాదం జరిగింది. నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన భక్తులు బోటులో ప్రయాణిస్తుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22మంది చనిపోయారు. 

>  2018 జూలైలో తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలో లాంచీ తిరగబడింది. ఈ ప్రమాదంలో 15మంది చనిపోయారు. ఈ ఘటన కూడా ఆదివారం జరిగింది.

>  కచ్చులూరు బోటు ప్రమాదం కూడా ఆదివారమే జరిగింది. రెండో శనివారం, ఆదివారం రెండు రోజులు వరుస సెలవులు రావడంతో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాలు, ఉద్యోగులు తమ పిల్లలతో కలిసి విహారయాత్ర కోసం పాపికొండల పర్యటనకు వెళ్లారు. కానీ.. విహారయాత్ర విషాదయాత్రగా మారింది. లాంచీ బోల్తా పడిన ఘటన.. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

72 మందితో గండి పోచమ్మ ఆలయం నుంచి పాపికొండల వైపు ప్రయాణమైన రాయల్ వశిష్ఠ లాంచీ.. తన గమ్యానికి చేరుకోలేకపోయింది. కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైంది. బోటు నుంచి 24 మంది సురక్షితంగా కచ్చులూరు సమీపంలో ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. 38 మంది గల్లంతైనట్లు నిర్ధారించిన అధికారులు వారి కోసం గాలింపు చర్యలను చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంలో గల్లంతైన వారి కోసం స్థానికులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు.
Read More : బోటు ప్రమాదం : 38 మంది ఎక్కడ..కుటుంబసభ్యుల్లో ఆందోళన