ఏపీ అంతటా ఒక లెక్క.. అక్కడ మాత్రం ఇంకో లెక్క!

10TV Telugu News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ఒక లెక్క.. యువరాజు బేబీనాయన కోటలో ఇంకో లెక్క.. ఏ నేతను లాగితే ఏ ఊరు సొంతం అవుతుందో బేబీనాయనకు బాగా తెలుసు.. పంచాయతీ పోరులో బొబ్బిలి కోట నుంచి పొలికేక పెట్టి ఘన విజయాలతో అధికార పార్టీ ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడికి గట్టి షాక్ ఇచ్చింది టీడీపీ. ఘనాపాటీలకు సైతం సాధ్యం కాని ఫలితాలను తన ప్రాంతంలో సాధించి తనదైన సత్తా చాటుకున్నారు యువరాజు బేబీనాయన. ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌, వార్డు సభ్యులతో బొబ్బిలి కోట ప్రాంగణం నిండిపోయింది. పార్టీ మద్దతుదారులు, పల్లెపోరు విజేతలతో సందడి చేశారు బేబీనాయన.

రెండు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ మద్దతుదారులే ఎక్కువగా సర్పంచ్‌ పదవులను కైవసం చేసుకోగా.. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పరిస్థితి భిన్నంగా ఉంది. బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి బేబీనాయనకు ప్రజల్లో మంచి క్రేజ్‌ ఉండగా.. ఇన్నాళ్లూ తన అన్నయ్య, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయానికి తెర వెనుక ఉండి రాజకీయాలు చేసిన బేబేనాయన.. ఇటీవల నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు తీసుకుని వ్యూహాల్లో మరింతగా ఆరితేరారు. మొత్తం నియోజకవర్గంలో 110 పంచాయతీల్లో 45 స్థానాలు గెలిపించుకుని..అధికార పార్టీ నేతలకు చెమట్లు పట్టించారు.

కీలకమైన బాడంగి, తేర్లాం, రామభద్రపురం పంచాయతీలను సైతం టీడీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. బాడంగి మండలంలో వైసీపీ మద్దతుదారులు 9 పంచాయితీలకే పరిమితం కాగా, టీడీపీ మద్దతుదారులు ఏకంగా 15 పంచాయతీలను గెలుచుకున్నారు. మిగిలిన మూడు మండలాల్లో సైతం నువ్వా నేనా అన్న చందంగా ఫలితాలు రాబట్టారు బేబీనాయన. బేబీ నాయనకు నియోజకవర్గ ప్రజలతో మంచి పరిచయాలుండడం.. లేటెస్ట్‌గా వచ్చిన ఫలితాలతో ఆయన గురించి స్థానికంగా చర్చించుకుంటున్నారు. బొబ్బిలిలో బేబీనాయన రాబట్టిన ఫలితాలపై పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. పంచాయతీల్లో సత్తా చాటేసరికి.. ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు క్రమంగా సడలుతోందనే వాదన వినిపిస్తోంది.