‘ఖాకీ’ జూదం : ఆర్ఎస్ఐ సమక్షంలో పేకాట

  • Edited By: madhu , January 10, 2019 / 09:54 AM IST
‘ఖాకీ’ జూదం : ఆర్ఎస్ఐ సమక్షంలో పేకాట

విజయవాడ : తాము పోలీసులం..మమ్మల్ని ఏమంటారు…అంటూ ఏమనుకున్నారో ఏమో…ఏకంగా పీఎస్‌ ఆవరణలోనే పేకాట ఆడారు. ఆర్ఎస్ఐ సమక్షంలో ఈ ఆట సాగడం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. భవానీపురం పీఎస్ ఆవరణలో పోలీసులు పేకాట ఆడుతున్న దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పేకాట ముక్కలు వేస్తూ పోలీసులు ఫుల్ ఏంజాయ్ చేశారని చెప్పవచ్చు. పేకాట ఆడుతున్న వారిని పట్టుకోవాల్సిన పోలీసులే ఈ విధంగా చేయడాన్ని నోరెళ్లబెడుతున్నారు.
భవానీపురం పీఎస్ పక్కనే ఉన్న ఓ భవనంలో వెంకటగిరి బెటాలియన్ సిబ్బంది ఉంటారు. ఆర్ఎస్ఐ వీరికి నేతృత్వం వహిస్తుంటాడు. ఆర్ఎస్ఐ స్వయంగా తోటి కానిస్టేబుళ్లతో పేకాట ఆడాడు. విధులు నిర్వహించకుండా ఆయుధాలు పక్కన పడేసి పేకాట కార్డులను అందుకున్నారు. వెంకటగిరి బెటాలియన్ సిబ్బందిపై గతంలో పలు ఆరోపణలున్నాయి. నిత్యం కానిస్టేబుళ్లు పేకట ఆడుతారని..మద్యం సేవిస్తుంటారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సీఐ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.