సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు: ప్రతి శుక్రవారం రావల్సిందే

  • Published By: vamsi ,Published On : January 24, 2020 / 12:04 PM IST
సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు: ప్రతి శుక్రవారం రావల్సిందే

అక్రమాస్తుల కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపున కోరుతూ జగన్ వేసిన పిటీషన్‌ను తిరస్కరించింది సీబీఐ కోర్టు.

తనకు బదులు జగతి పబ్లికేషన్స్ నుంచి సహ నిందితుడు హాజరవుతారని కోరగా.. అందుకు నిరాకరించింది కోర్టు.. ఇప్పటికే 10 దఫాలు జగన్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చిన కోర్టు.. జనవరి 10వ తేదీన సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో… సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి కూడ కోర్టుకు హాజరయ్యారు.

అయితే ఇవాళ(24 జనవరి 2020) మరోసారి మినహాయింపు కోరగా.. విచారణ జరిపిన కోర్టు అందుకు నిరాకరించింది. అక్రమాస్తుల కేసులో తప్పనిసరిగా హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శుక్రవారం నాడు సీబీఐ కోర్టుకు హాజరు కావాలనే విషయమై మినహాయింపును ఇవ్వాలని గతంలో కూడ కోర్టును జగన్ తరపున లాయర్లు కోరారు.

అయితే అందుకు నిరాకరించింది కోర్టు. తన తరపున సహ నిందితుడు ఈడీ కేసులో కోర్టుకు హాజరు అవుతారని ఏపీ సీఎం వైఎస్ జగన్ కోర్టుకు వివరించారు. ఈడీ కేసులో వ్యక్తిగతంగా తన హజరును మినహయించాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. దీంతో జగన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. వ్యక్తిగతంగా హాజరు కాక తప్పట్లేదు. జనవరి 31వ తేదీ నుంచి ఈడీ దాఖలు చేసిన 11 ఛార్జీషీట్లపై ఈడీ కోర్టులో ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.