2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించాం – బాబు

  • Edited By: madhu , October 3, 2019 / 01:01 AM IST
2003లోనే గ్రామ సచివాలయాలను ప్రారంభించాం – బాబు

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ, వార్డు వాలంటీర్‌ వ్యవస్థపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. గ్రామ సచివాలయాలను తాము 2003లోనే ప్రారంభించామని.. ఇప్పుడేదో కొత్తగా తీసుకొచ్చినట్టు వైసీపీ ప్రభుత్వ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. అక్టోబర్ 02వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయ్యింది.

పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలన్న తపనతోనే గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చామని చెప్పారు సీఎం జగన్‌. ప్రభుత్వం ప్రజలకు అందించే సేవల్లో అవినీతి, వివక్షకు తావులేకుండా చూసేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పారు. దేశ చరిత్రలో ఇదొక వినూత్న వ్యవస్థన్నారు. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలను తీసుకువచ్చామని.. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. ఈ నాలుగు నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెక్కడా జరిగి ఉండదన్నారు జగన్‌.

దీనిపై బాబు విమర్శలు గుప్పించారు. ప్రజా ధనాన్ని వైసీపీ కార్యకర్తలను దోచిపెట్టేందుకే ఈ వ్యవస్థను తీసుకొచ్చారని మండిపడ్డారు. కార్యకర్తలకు ఉద్యోగాలు ఇవ్వడానికి, ప్రజలు కట్టే డబ్బును దోచి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు. 

మరోవైపు గ్రామ సచివాలయానికి అనుబంధంగా ఒక షాపు ఏర్పాటు చేయాలని జగన్‌ సర్కార్‌ నిర్ణయించింది. ఈ షాపుల్లో ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందుల అందుబాటులో ఉంచుతారు. ఈ షాపు పక్కనే వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసి అన్ని రంగాల్లో రైతులకు శిక్షణ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. మొత్తానికి గ్రామ, వార్డు సచివాలయాల ప్రారంభం అధికార, విపక్ష పార్టీల మధ్య మరోసారి చిచ్చుపెట్టింది. 
Read More : జనసేన పార్టీకి కీలక నేత రాజీనామా