ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష

ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 01:51 AM IST
ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష

ఏపీలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు.

ఏపీ రాజకీయాల్లో ఇసుక దుమారం తుపానుగా మారింది. ఇసుక కొరతను పరిష్కరించడంతో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలంటూ నేడు చంద్రబాబు దీక్ష చేపట్టబోతున్నారు. కాగా.. ప్రతిపక్ష నేతకు పోటీగా దీక్షకు దిగుతానన్న వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథికి పోలీసులు అనుమతి నిరాకరించారు.

రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాటానికి సిద్ధమయ్యారు. విజయవాడ అలంకార్ సెంటర్ ధర్నా చౌక్‌లో దీక్షకు దిగనున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 12 గంటలపాటు దీక్ష చేయనున్నారు. ధర్నాచౌక్‌లో చంద్రబాబు దీక్ష కోసం టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా దీక్ష ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరించటంతో పాటు పనులు లేక చనిపోయిన భవన నిర్మాణ కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 10వేల చొప్పున భృతి అందించాలనే డిమాండ్లను సర్కారు ముందు పెట్టారు.

ఇసుక సమస్యపై టీడీపీ శ్రేణులు రెండుసార్లు ఆందోళన నిర్వహించాయి. విశాఖలో పవన్‌కళ్యాణ్ చేపట్టిన లాంగ్‌మార్చ్‌కు సైతం టీడీపీ మద్దతు తెలిపింది. దశలవారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తూ వచ్చిన చంద్రబాబు… ఇప్పుడు తానే స్వయంగా దీక్షకు దిగుతున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలిసి దీక్షకు మద్దతు కోరారు. బాబు దీక్షకు బీజేపీ సంఘీభావం తెలపగా… జనసేన తమ ప్రతినిధుల బృందాన్ని పంపించాలని నిర్ణయించింది.

మరోవైపు చంద్రబాబుకు పోటీగా వైసీపీ ఎమ్మెల్యే పార్ధసారథి కూడా దీక్షకు రెడీ అయ్యారు. బాబు దీక్షా శిబిరం పక్కనే తాను కూడా కూర్చుంటానని ప్రకటించారు. ఇసుక అక్రమ రవాణాలో తనను అనవసరంగా ఇరికించారంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నా చౌక్ వద్ద తన దీక్షకు అనుమతించాలని హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులను ఆయన కోరారు.

చంద్రబాబు హయాంలో లక్షల టన్నుల ఇసుక అక్రమంగా పోగేశారని పార్థసారథి ఆరోపించారు. మీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి మర్చిపోయారా అంటూ చంద్రబాబుకు చురకలంటించారు.