ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబు ఆస్తులు

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో చంద్రబాబు ఆస్తులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం తొలి రోజు ఫస్ట్ సెషన్ ఆరంభమైంది. ఈసందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడితో సహా పార్టీ నాయకులు, అనుచరులు కొనుగోలు చేసిన స్థలాల వివరాలు బయటపెట్టారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ చంద్రబాబు పదవిలోకి వచ్చీరాగానే రాజధాని ప్రకటన రాకముందే కొనుగోలు చేయడం పట్ల అనుమానం వ్యక్తం చేశారు. 

ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ కు సంబంధించిన ఆస్తులు కూడా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. హెరిటేజ్ కు సంబంధించి అమరావతికి కాస్త దూరంలోనే కొనుగోలు జరిపారని ఈ స్థలాలు చుట్టూనే ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేలా కొనుక్కున్నారని వ్యాఖ్యానించారు. 

– తాడికొండ మండలం కంతేరు వద్ద సర్వే నంబర్లు 27/3బి, 22/2ఎ, 63/1, 62/2బి, 27/3ఎలలో 7.21 ఎకరాలను రూ.67.88 లక్షలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే కొనుగోలు చేసి తన కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ పేరుతో అగ్రిమెంట్‌ చేసుకున్నారు. జూలై 7, 2014న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు 8, 2014న కంతేరులోనే సర్వే నెంబర్లు 63/బి, 56లలో ఉన్న 2.46 ఎకరాలను రూ.19.68 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. లింగమనేని ఇన్‌ఫో సిటీ సంస్థకు చెందిన చిగురుపాటి వెంకటగిరిధర్‌ నుంచి జీపీఏ ద్వారా కంతేరు వద్దే సర్వే నెంబర్లు 63/2బి, 63/1, 56 సర్వే నెంబర్లలో ఉన్న 4.55 ఎకరాలను రూ.36.40 లక్షలకు కొనుగోలు చేశారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థ ఇలా 14.22 ఎకరాలను కొనుగోలు చేసింది. 

– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నన్నపనేని లక్ష్మీనారాయణ అత్యంత సన్నిహితుడు. రాజధానికి కూత వేటు దూరంలో చంద్రబాబు, యనమల కొనుగోలు చేసిన భూమికి సమీపంలోనే నన్నపనేని లక్ష్మీనారాయణ పేరుతో సర్వే నెంబర్‌ 397–బీ, 398–బీ లో 1.5 ఎకరాలు, 397–ఎ2, 397–ఎ1, 398–ఎ, 397–బీ, 398–బీలో 4.505 ఎకరాలు, 380లో ఒక ఎకరాతోపాటు మరో సర్వే నంబర్‌తో కలిపి మొత్తం 7.50 ఎకరాల భూమిని రూ.కోటికే కొనుగోలు చేసి ఆగస్టు 13, 2014న రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. రాజధానిపై దేవినేని ఉమాకు నాడు చంద్రబాబు ముందే సమాచారం ఇచ్చి భూమిని కొనుగోలు చేయించారు అనడానికి ఈ రిజిస్ట్రేషన్‌ పత్రాలే రుజువు.