10టీవీ ఎఫెక్ట్ : బాసర ట్రిపుల్ ఐటీ కొనుగోళ్ల టెండర్ రద్దు 

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 06:57 AM IST
10టీవీ ఎఫెక్ట్ : బాసర ట్రిపుల్ ఐటీ కొనుగోళ్ల టెండర్ రద్దు 

బాసర ట్రిపుల్ ఐటీ అవినీతిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారులు వెనక్కి తగ్గారు. ల్యాప్ టాప్ కొనుగోళ్ల టెండర్ రద్దు చేశారు. బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు వేసుకునే దుస్తులు, తాగే వాటర్, ఉపయోగించే ల్యాప్ టాప్ వరకు భారీ అవినీతికి పాల్పడ్డారు కొందరు అధికారులు. వీటిపై 10టీవీ సాక్ష్యాధారాలను సేకరించి.. అసలు విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కథనాలకు స్పందించిన ప్రభుత్వం ల్యాప్ టాప్ ల కొనుగోలు టెండర్లు రద్దు చేసింది. 

2018-19 ఎడ్యుకేషన్ ఇయర్ కు సంబంధించి 1,500 ల్యాప్ టాప్ కొనుగోలు విషయంలో ఈ ప్రెక్యూర్ మెంట్ టెండర్లు ఇవ్వగా.. పలు కంపెనీలు టెండర్లు వేశాయి. ఫైనల్ గా హెచ్ పీ సంస్థ ఈ టెండర్ దక్కించుకుంది. ఇంతకీ వర్శిటీ కొనుగోలు చేసిన ల్యాప్ టాప్ రేటు వింటే ఆశ్చర్యపోక తప్పదు. ఒక్కో ల్యాప్ టాప్ రూ. 51వేల 600. కేవలం రూ.36వేల 950కే ఇస్తామన్న కంపెనీకి టెండర్ దక్కలేదు. అనుకూలంగా ఉండే కంపెనీకే ఈ టెండర్ దక్కేలా కొందరు అవినీతి అధికారులు ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

ఈ అంశంపై ఇన్వెస్టిగేట్ చేసిన 10టీవీని ప్రలోభపెట్టేందుకు.. ట్రిపుల్ ఐటీ అక్రమార్కులు యత్నించారు. ప్రలోభాలకు లొంగని 10టీవీ అసలు విషయాలను బట్టబయలు చేసింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన ప్రభుత్వం.. ల్యాప్ టాప్ కొనుగోలు విషయంలో విచారణ జరిపింది. కొనుగోళ్ల టెండర్ రద్దు చేసింది. యూనివర్శిటీ కూడా టెండర్లను రద్దు చేసినట్లుగా నోటు విడుదల చేసింది. నోట్ను యూనివర్శిటీ వెబ్ సైట్ లో పొందుపరిచింది.