హమ్మయ్య : చిరుతను పట్టుకున్నారు

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 02:02 AM IST
హమ్మయ్య : చిరుతను పట్టుకున్నారు

తూర్పుగోదావరి : చిరుత ఎట్టకేలకు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో గత 10 రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుతను అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు దొరిక్కిచ్చుకున్నారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్న చిరుతను ఫారెస్ట్‌ సిబ్బంది ఎంతో శ్రమించి పట్టుకున్నారు. చిరుతను బంధించడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. తొలుత ముమ్మడివరం మండలం గేదెల్లంకలోని ఓ కొబ్బరితోటలో ఉన్న గుడిసెలో దూరిన చిరుతకు వైద్యులు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నాలుగుసార్లు మత్తు ఇంజక్షన్‌ ఇచ్చే యత్నం చేసినా ఫలించలేదు.

అయితే.. రెస్క్యూ ఆపరేషన్‌ విరమించి తర్వాత ప్రయత్నిద్దామనుకున్నారు. కానీ.. చిరుత బలుసులంకలో ఉందని సమాచారం తెలుసుకుని ఫారెస్ట్‌ సిబ్బంది.. మరోసారి చిరుతపై మత్తు ఇంజక్షన్‌ ప్రయోగించారు. అనంతరం మత్తులోకి జారుకున్న చిరుతను బంధించారు. గత 10 రోజులుగా చిరుత ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఫిబ్రవరి 4వ తేదీ అంకంపాలెం గ్రామంలోకి ప్రవేశించిన బీభత్సం సృష్టించింది. నలుగురిని గాయపరిచి చెట్టు ఎక్కింది.

చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు లైట్లు ఆపివేయడంతో.. చిరుత తప్పించుకుని పొలాల్లోకి పారిపోయింది. ఆ తర్వాత మళ్లీ ముమ్మడివరం మండలం గేదెలంకలో చిరుత ప్రత్యక్షమైంది. దీంతో మరోసారి ఫారెస్ట్‌ అధికారులు రంగంలోకి చిరుతను పట్టుకున్నారు. హడలెత్తించిన చిరుతను పట్టుకోవడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భవిష్యత్‌లో మరోసారి చిరుత గ్రామాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.