ప్రతి నెల రూ.3వేలు మీ ఖాతాలో : ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 03:52 PM IST
ప్రతి నెల రూ.3వేలు మీ ఖాతాలో : ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి

ప్రకాశం : మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని పట్టదలగా ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. నిరుద్యోగ యువతకు వరం ప్రకటించారు. మరోసారి  టీడీపీని గెలిపిస్తే నిరుద్యోగ భృతిని పెంచుతామని, ఇంటర్ నుంచే ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వెయ్యి రూపాయలతో ప్రారంభించి నిరుద్యోగ భృతిని రూ.2వేలు చేశామని, భవిష్యత్తులో అది రూ.3వేలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతేకాదు ఇకపై ఇంటర్ నుంచే నిరుద్యోగ భృతి అందించడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు డిగ్రీ చదివిన వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రకాశం జిల్లా అద్దంకిలో టీడీపీ ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడారు.

డ్వాక్రా మహిళల కోసం ఐదేళ్ల వ్యవధిలో 3 పర్యాయాలు పసుపు-కుంకుమ నిధులు అందజేస్తామని, వారికి అండగా ఉంటామని చంద్రబాబు వాగ్దానం చేశారు. పండుగ సమయాల్లో 2 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. కోటిమందికి స్మార్ట్ ఫోన్లు అందజేస్తామన్నారు. చంద్రన్నా, ఈ సమస్య ఉందంటూ ఆ ఫోన్ లో ఒక్క బటన్ నొక్కితే ఆ పని పూర్తిచేసే బాధ్యత తనదే అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చెప్పింది చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులను ఆదుకునేందుకు నిధులు విడుదల చేస్తామని చంద్రబాబు తెలిపారు.

ఏపీలో 12లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు అంచనా. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి అందిస్తున్నారు. నెలకు రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు డిగ్రీ, అంతకంటే ఎక్కువ చదివిన నిరుద్యోగులకు మాత్రమే ఇస్తున్న నిరుద్యోగ భృతిని ఇకపై ఇంటర్ చదివిన వారికి కూడా ఇస్తామని చంద్రబాబు ప్రకటించడం విశేషం. ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు. మరి చంద్రబాబు హామీలు ఏ మేరకు ఫలిస్తాయో, ఎన్ని ఓట్లు కురిపిస్తాయో చూడాలి.