తప్పు చేసుంటే చర్యలు తప్పవు : సింహపురి ఆసుపత్రికి సీఎం వార్నింగ్

  • Published By: veegamteam ,Published On : May 5, 2019 / 10:13 AM IST
తప్పు చేసుంటే చర్యలు తప్పవు : సింహపురి ఆసుపత్రికి సీఎం వార్నింగ్

ఏపీలో సంచలనం రేపిన నెల్లూరు జిల్లా సింహపురి ఆస్పత్రి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సింహపురి ఆసుపత్రిలో అవయవదానం వ్యవహారం వివాదానికి దారి తీసింది. గిరిజన  కుటుంబాన్ని ఆసుపత్రి యాజమాన్యం మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అవయవదానం చేస్తే ఆసుపత్రి బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి అవయవాలను బలవంతంగా తీసుకున్నట్టు  బాధిత కుటుంబం చెబుతోంది. దీంతో ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా సింహపురి ఆసుపత్రి వర్గాలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి అధికారులు వెనకాడుతున్నారు. ఆసుపత్రిపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంలోని ఓ అత్యున్నత అధికారి అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

దీంతో ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. దీనిపై స్పందించిన సీఎం చంద్రబాబు సింహపురి ఆసుపత్రి వివాదంపై వివరాలు తెప్పిస్తున్నామని చెప్పారు. తప్పు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందే అని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని ఎవరు వెనకేసుకొచ్చినా తప్పే అని చంద్రబాబు తేల్చి చెప్పారు. చట్టవిరుద్ధంగా అవయవాలు సేకరించడం తీవ్రమైన నేరం అని చంద్రబాబు అన్నారు. స్టేట్ మెడికల్ కౌన్సిల్.. సింహపురి ఆసుపత్రి వైద్యులకు నోటీసులు ఇచ్చింది. అవయవదానం కేసులో వివరణ కోరింది. అవయవదానం కేసుతో సంబంధం ఉన్న ఐదుగురు వైద్యులు వ్యక్తిగతంగా నివేదికలు పంపాలని ఆదేశించింది.

అవయవదానం అంటే చనిపోయిన వ్యక్తిని బతికించడమే. ఇదో గొప్ప కార్యక్రమం. అలాంటిది కొందరు డాక్టర్లు కాసుల కోసం తూట్లు పొడుస్తున్నారు. సింహపురి ఆసుపత్రి వైద్యులు అలాంటి పనే చేశారు. అవయవదానం ముసుగులో వ్యాపారం చేస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే పేద గిరిజన కుటుంబాన్ని అవయవ దానానికి అంగీకరించేలా సింహపురి ఆసుపత్రి సిబ్బంది ఒత్తిడి చేసిందనే విషయం విచారణలో స్పష్టమైంది. నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన ఏకుల శీనయ్య 2019, ఏప్రిల్‌ 17వ తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే శీనయ్యను చికిత్స కోసం సింహపురి ఆసుపత్రికి తీసుకెళ్లారు. 2 రోజులు వైద్యం చేసిన డాక్టర్లు రూ.1.20లక్షల బిల్లు వేసి, బ్రెయిన్‌ డెడ్‌ అయిందని వెల్లడించారు.

శీనయ్య మృతదేహం అప్పగించాలంటే ఆసుపత్రి బిల్లు చెల్లించాలని పట్టుబట్టారు. తాము పేదోళ్లమని అంత డబ్బు లేదని శీనయ్య కుటుంబసభ్యులు చెప్పారు. బిల్లు కట్టకుండా ఉండాలంటే అవయవదానంకు అంగీకరించాలని శీనయ్య భార్య అరుణతో ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. డబ్బు కట్టే స్తోమత లేని కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు. దీంతో వారు శీనయ్య అవయవాలు తీసుకున్నారు. శీనయ్య రెండు కిడ్నీలు, గుండె, రెండు కళ్లను తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి వర్గాలు చేసిన మోసం అరుణకు తెలిసింది. దీంతో ఏప్రిల్ 21వ తేదీన ఆమె జిల్లా కలెక్టర్‌ ని ఆశ్రయించింది. సింహపురి ఆసుపత్రి తీరుపై కలెక్టర్ కి ఫిర్యాదు చేసింది.