అమరావతిపై కేబినెట్ మీటింగ్ : సీఎం జగన్ ఏం తేల్చనున్నారు?నిర్ణయాలు ఇవేనా?

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 05:05 AM IST
అమరావతిపై కేబినెట్ మీటింగ్ : సీఎం జగన్ ఏం తేల్చనున్నారు?నిర్ణయాలు ఇవేనా?

ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ కేబినెట్ భేటీ కానుంది. ఈ క్రమంలో కేబినెట్ తీసుకునే నిర్ణయం ఏమిటీ? రాజధాని రైతుల ఆందోళనపై స్పందిస్తుందా? లేదా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపైనే కొనసాగుతారా? లేదా అమరావతి ప్రాంత రైతులకు భరోసా కల్పించేలా కేబినెట్ ప్రకటన ఉంటుందా ? రాజధానిగా అమరావతి తప్ప తమకేమీ వద్దంటున్న రైతుల డిమాండ్ ను ప్రభుత్వం పట్టించుకుంటుందా? పరిగణలోకి తసుకుంటుందా? తకు కావాల్సింది నిధులుకాదు అమరావతే రాజధానిగా ఉండాలని మూడు రాజధానులు వద్దని రైతులు చేస్తున్న డిమాండ్ పై కేబినెట్ కమిటీ ఏం నిర్ణయం తీసుకుంటుంది? ఎటువంటి ప్రకటన చేస్తుంది? అనేదానిపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

రాజధాని గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్న క్రమంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. రాజకీయ వర్గాలు, మేధావుల నుంచి సామాన్యులు కూడా ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చినాటినుంచి ఇదే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఈరోజు సీఎం జగన్ కేబినెట్ ఏం నిర్ణయిస్తుంది. మూడు రాజధానులకు కట్టుబడి ఉంటారా? అమరావతి రైతుల ఆవేదనను..ఆందోళనను పట్టించుకుంటారా? అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం జగన్ నిర్ణయం కోసం అమరావతి రైతులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎంతో ఆశతోఎదురు చూస్తున్నారు. 

మూడు రాజధానుల ప్రకటనతో ప్రకంపనలు
ఏపీ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని అమరావతిలో మొదలైన ప్రకంపనలు జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత మరింత ఎక్కువయ్యాయి.  దీంతో రాజధానిగా అమరావతి తప్ప మాకేదీ వద్దని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని మార్పును వ్యతిరేకిస్తూ 29 గ్రామాల రైతులతో పాటు కుటుంబాల్లోని మహిళలు, చిన్నారులు, విద్యార్ధులు ప్రతీరోజూ రోడ్డెక్కి పలు విధాలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆందోళనల పర్వం తారా స్ధాయికి చేరుకోవటంతో సీఎం జగన్ సహా మంత్రులు కూడా సెక్రటేరియట్ కు రావటమే మానివేశారు. ఈ వ్యవహారానికి ఇంకా నాన్చడం అనవసరమన్న ప్రభుత్వం నిర్ణయించుకుందేమో..కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసింది. 

ఈ క్రమంలో కేబినెట్ మీటింగ్ రాజధానిపైనే ప్రధాన చర్చించే అవకాశం ఉంది. రాజధాని రైతులను శాంతింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం నేడు కేబినెట్ లో చర్చ తర్వాత దీనికి ఆమోద ముద్ర వేయబోతోందని సమాచారం. దీంట్లో రాజధాని రైతులకు గతంలో ఇచ్చిన ఐదేళ్ల కౌలు చెల్లింపు గడువు మరో పదేళ్ల పెంపుతో పాటు ప్యాకేజీలోనూ భారీ మార్పులు ఉండొచ్చనే సమాచారం.
 
అంతేకాకుండా రైతులకు మరింత ఊరటకలిగేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉంది. వారి భూములకు బదులుగా మరేదైనా ప్రత్యామ్నాయాన్ని ఇచ్చేందకు యోచిస్తోంది. దీంట్లో బాగంగా వారి భూములకు బదులుగా విశాఖలోని భూములను ఇవ్వొచ్చే అనే కొత్త అంశంకూడా తెరపైకి వచ్చింది. కానీ ఇది ఎంతవరకూ వాస్తవం అనే ఆలోచనకూడా ఉంది. 
మరోవైపు గతంలో టీడీపీ ప్రభుత్వం రాజధాని రైతులకు ఇచ్చిన హామీలు కూడా ఇప్పటి వరకూ నెరవేరలేదు.  ముఖ్యంగా రైతు కుటుంబాల్లోని పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలు నెరవేరలేదు. వాటిని తక్షణం అమలు చేసేలా వైసీపీ సర్కారు ఓ ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది. దీంతోనైనా రైతులు శాంతిస్తారని సీఎం జగన్ యోచనగా ఉంది.

వీటితో పాటు అమరావతి రైతులకు అమరావతిలో చేయబోయే డెవలప్ మెంట్ లో వారిని భాగస్వాములను చేసేలా సీఎం జగన్ కేబినెట్ మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోందని సమాచారం. దీనిపై ఆ ప్రాంత రైతులతో చర్చించి ఖరారు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. మరి కేబినెట్ మీటింగ్ పైనే మొత్తం ఏపీ ప్రజల కన్ను ఉంది. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. వారికి అనుకూలంగా ప్రకటన వస్తే ఆందోళన విరమిస్తామనీ..లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని అంటున్నారు రైతన్నలు. మరి ఏం జరగుతుందో? ఎటువంటి ప్రకటన వస్తుందో వేచి చూడాలి. 

విశాఖలో రాజధాని పనులపై దూకుడుమీదున్న సీఎం జగన్ 
కానీ సీఎం జగన్ రైతులకు ఎన్ని హామీలిచ్చినా రైతులు మాత్రం  రాజధానిని అమరావతే అనే పట్టుబట్టే అవకాశముంది. కానీ ప్రభుత్వం కూడా నిర్మాణాత్మక ప్లానింగ్ ని ప్రకటిస్తే.. రైతుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదేకనుక జరిగితే విశాఖలో రాజధాని పనులు ప్రారంభించేందుకు దూకుడుగా ఉన్న ప్రభుత్వం ఆ పనులపై చకచకా నిర్ణయాలు తీసేసుకుని పనిలో దిగిపోయేందుకు రెడీగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం జగన్  28న విశాఖ పర్యటన. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు సీఎం జగన్  దూకుడుమీదున్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా విశాఖ ఉత్సవ్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఎంపీ విజయసాయిరెడ్డి చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూ.1290 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతోంది.