సీఎం జగన్ పెద్ద మనసు, అలాంటి పోలీస్‌ సిబ్బందికి లాక్‌ డౌన్‌ డ్యూటీ నుంచి మినహాయింపు

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 12:24 PM IST
సీఎం జగన్ పెద్ద మనసు, అలాంటి పోలీస్‌ సిబ్బందికి లాక్‌ డౌన్‌ డ్యూటీ నుంచి మినహాయింపు

ఏపీ సీఎం జగన్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. వయసు పైబడిన, అనారోగ్యంతో బాధపడుతున్న పోలీసు సిబ్బందిపై దయ చూపించారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్‌డౌన్‌ విధులు అప్పగించొద్దని పోలీస్‌ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయిలో 55 సంవత్సరాలు పైబడిన పోలీస్‌ సిబ్బందికి లాక్‌ డౌన్‌ డ్యూటీ వేయొద్దని చెప్పారు. గుండె, శ్వాస, షుగర్ వంటి సమస్యలతో ఉన్నవారిని క్షేత్రస్థాయి విధులకు దూరంగా ఉంచాలన్నారు. అటువంటి వారికి పోలీస్‌ స్టేషన్, ఆఫీస్, కంట్రోల్‌ రూంలలో మాత్రమే విధులు కేటాయించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ ను అమలులో పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబాలను వదిలి, మండుటెండుల్లో, 24 గంటలు డ్యూటీ చేస్తూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. దీంతో వయసు పైబడిన వారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. గంటలు గంటలు నిలబడలేక, ఎండకు తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు.

వారి కష్టాలను తెలుసుకున్న సీఎం జగన్ పెద్ద మనసుతో స్పందించారు. పోలీసుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. 55ఏళ్లు పైబడిన, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి లాక్ డౌన్ డ్యూటీ వేయొద్దని డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు. సీఎం జగన్ నిర్ణయం పట్ల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఆదేశాలను తక్షణమే అమల్లోకి తీసుకుని వస్తున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. 55 సంవత్సరాలు పైబడిన, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పోలీస్‌ సిబ్బందికి లాక్‌డౌన్‌ డ్యూటీల నుంచి మినహాయిస్తున్నామన్నారు. అలాంటి పోలీసులకు ఫీల్డ్ డ్యూటీ కాకుండా.. ఆఫీసు, పోలీసు స్టేషన్‌లకే పరిమితం చేస్తామన్నారు.