అంత లావు మహారాష్ట్రలో ఒక్కరే: సీఎం జగన్

  • Published By: vamsi ,Published On : November 28, 2019 / 08:45 AM IST
అంత లావు మహారాష్ట్రలో ఒక్కరే: సీఎం జగన్

దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మహా రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్. విస్తీర్ణం జనాభాతో పోలిస్తే మన రాష్ట్రం కంటే ఎంతో పెద్దది అయిన మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ఒక్కరికే ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఐదుగురికి అవకాశం ఇచ్చామని అన్నారు సీఎం జగన్. 

జ్యోతిరావు పూలే వర్థంతి కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. అంత లావు మహారాష్ట్రలో ఒక్క ఉప ముఖ్యమంత్రిని నియమిస్తే, ఎవరూ ఊహించని విధంగా ఏపీ మంత్రి వర్గం కూర్పులో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను నియమించామని చెప్పారు. కేబినెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని, అలాగే నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు జగన్.

రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నామని, తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించే పెద్దమనుషులు.. పేదలకు ఇంగ్లిష్ వద్దంటూ మాట్లాడడంపై మండిపడ్డారు జగన్. పేద విద్యార్థుల చదువు కోసం ఎంత ఖర్చయినా భరిస్తామని స్పష్టం చేశారు జగన్.

ఇదే సమయంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్. చంద్రబాబు పోతూ పోతూ ప్రతి అడుగులోనూ అప్పులు పెట్టి పోయారని, రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, అయినా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయలేదని అన్నారు జగన్. దేవుడిపై నమ్మకంతో సంక్షేమపథకాలు అమలు చేస్తున్నామని జగన్‌ చెప్పుకొచ్చారు.