కియా మోటార్ తరలింపుపై జగన్ సమాధానం చెప్పాలి : దేవినేని ఉమ

  • Published By: veegamteam ,Published On : February 6, 2020 / 06:15 AM IST
కియా మోటార్ తరలింపుపై జగన్ సమాధానం చెప్పాలి : దేవినేని ఉమ

కియా మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు తరిలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. మూడు రాజధానులంటూ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీకి భారీగా నష్టాలు జరుగుతున్నాయనీ..దీంట్లో భాగంగానే ప్రపంచంలో ఐదో అతిపెద్ద కారు మార్కెట్ ఉన్న సంస్థ కియో.. ఏపీలో ఏర్పాటు చేసిన కియో పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలు వస్తున్నాయనీ..దీనికి జగన్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. 

ఏపీలో కియా పరిశ్రమతో ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా దేవినేని గుర్తు చేశారు. ‘కియ’ తరలింపుపై జగన్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కు పాలనపై ఏమాత్రం అవగాహన లేదనీ..అందుకే పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రానికి నష్టం చేస్తున్నారనీ…రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర రాజధాని అమరావతిని చంపేశారని ఆరోపించారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అమరావతికి భూములిచ్చిన రైతులు 50 రోజులుగా నిరసనలు చేస్తున్న క్రమంలో 39మంది రైతులు చనిపోతే ఎమ్మెల్యేలుగానీ..మంత్రులు గానీ..కనీసం వారిని పరామర్శించలేదని విమర్శించారు. ఇంతటి కఠిన ప్రభుత్వాన్ని తాను ఎక్కడా చూడలేదనీ ఆవేదన వ్యక్తంచేశారు.రాష్ట్రంలో 7 లక్షల పెన్షన్లను తొలగించి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనీ ఈ అంశంపై సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని మాజీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు.    

కాగా..దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్ సంస్థ ఆంధ్రా నుంచి తమిళనాడుకు తరలిపోతుందని వార్తలు వస్తున్నాయి. 1.1 బిలియన్ల విలువైన కియా ప్లాంట్‌ను తరలించే సాధ్యాసాధ్యాలపై తమిళనాడుతో చర్చలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాల సమాచారం. గత ఏడాదిలో పాలసీ విధానాల్లో మార్పులతో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఏపీలో కొన్నినెలల్లోనే తమిళనాడుకు తరిలిపోతుందంటూ రాయిటర్స్ కథనాన్ని వెలువరించింది.