గులాబీ జెండా ఎగురేనా : KCR ఖమ్మం టూర్

  • Published By: madhu ,Published On : April 3, 2019 / 01:37 PM IST
గులాబీ జెండా ఎగురేనా : KCR ఖమ్మం టూర్

ఎన్నాళ్లుగానో ఊరిస్తోందా స్థానం. సిట్టింగ్ సీటే అయినా.. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో జెండా ఎగురలేదు. దీంతో… అధినేత ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 04వ తేదీ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గులాబీ బాస్ కేసీఆర్.. గెలుపు దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఖమ్మంలో పర్యటించనున్న కేసీఆర్.. ఆ దిశగా కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన విధానాలు కాకుండా… ప్రతీ ఓటు టీఆర్ఎస్‌కే పడేలా చూడాలంటూ పార్టీ శ్రేణులకు సూచించనున్నారు.

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో 75 శాతం పంచాయితీలు టీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి. క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నా.. నేతల మధ్య సమన్వయం కొరవడిందనే భావన నెలకొంది. విభేదాలన్నీ పక్కనబెట్టి నామా నాగేశ్వరరాను గెలిపించేందుకు ప్రయత్నించాలని నేతలకు కేసీఆర్ సూచించనున్నారు. అధినేత పర్యటన నేపథ్యంలో భారీగా జన సమీకరణకు స్థానిక నేతలు ప్రయత్నిస్తున్నారు.

ఇక ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదుగురు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలుండటంతో.. పార్టీ శ్రేణులు ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతున్నారు. ఇక కేసీఆర్ కూడా వచ్చి ప్రచారం నిర్వహిస్తే..  నామా గెలుపు నల్లేరుపై నడకే అనే భావన పార్టీ నేతల్లో నెలకొంది. ఈ ఎన్నికల్లో వచ్చే మెజారిటీ, ఫలితాలను బట్టే పార్టీలో, ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలున్నాయి. దీంతో.. ఎలాగైనా ఈసారి ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగురవేయాలని నేతలు భావిస్తున్నారు.