పాలమూరు పచ్చబడాలె : దశ మారుస్తాం – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : August 30, 2019 / 01:39 AM IST
పాలమూరు పచ్చబడాలె : దశ మారుస్తాం – సీఎం కేసీఆర్

వచ్చే ఖరీఫ్‌ నాటికి పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. భవిష్యత్‌లో ఈ నీటిని సంగంబండకు సరఫరా చేసి.. అక్కడి నుంచి జూరాలకు తరలించనున్నట్టు చెప్పారు. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన కరివెన రిజర్వాయర్‌  నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలను కేసీఆర్‌ ఆదేశించారు.  ప్రస్తుతం నడుస్తున్న పనులను మూడు షిఫ్టులకు పెంచి నిరంతరాయంగా పనులు కొనసాగించాలన్నారు. 2019, ఆగస్టు 29వ తేదీ గురువారం కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను సందర్శించారు. నిర్మాణ పనులను పరిశీలించారు. 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు పూర్తి స్థాయిలో వాడుకునేలా రెండు నదులను అనుసంధానం చేస్తామని కేసీఆర్‌ అన్నారు. నదుల అనుసంధానంతో మహబూబ్‌నగర్‌తో పాటు వికారాబాద్, నల్లగొండ జిల్లాలకు తాగు, సాగు నీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని కేసీఆర్‌ తెలిపారు.  త్వరలోనే ఏపీతో  చర్చలు జరిపి జలాల వినియోగంపై ఓ ఒప్పందానికి వస్తామన్నారు. 

సాగునీటి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్‌ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని విస్మరించిన కాంగ్రెస్‌ నాయకులు.. ఇప్పుడు కూడా అలాగే చేయాలంటున్నారని సీఎం మండిపడ్డారు. 
Read More : హైదరాబాద్ లో భూములు అమ్మేస్తా