గిరిగీసిన పుంజులు : కోడిపందేలు @ రూ.2వేల కోట్లు

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 03:32 AM IST
గిరిగీసిన పుంజులు : కోడిపందేలు @ రూ.2వేల కోట్లు

సంక్రాంతి అంటేనే సంబరాల పండగ. ముచ్చటగా మూడు రోజులు జరుపుకునే సంబరం. కొత్త దుస్తులు, పిండివంటకాలే కాదు మరో ప్రధానమైన సంబరం కూడా ఉంది. అదే కోడి పందేలు. సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో పుంజుల సమరం ఖాయం. కోడి పందేలు పెద్ద ఎత్తున జరుగుతాయి. వేల కోట్ల రూపాయలు చేతులు మారతాయి. ఏపీలో పందెం కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి. కొడిపందేలు నిర్వహణకు బరులు సిద్ధం చేశారు. పందెం కాసేందుకు పందెం రాయుళ్లు నోట్ల కట్టలతో సిద్ధమయ్యారు. గుండాట, పేకాట నిర్వహణకు పందెం రాయుళ్లు లక్షలు, కోట్లు ధారపోస్తున్నారు. ఏపీలో జరిగే కోళ్ల పందేలకు తెలంగాణ నుంచి తరలి వెళ్తున్నారు.

పొలిటికల్ అండదండలు:
పందేలపై పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా పొలిటికల్ అండతో ఈసారి కూడా నిర్వాహకులు మరింతగా ‘బరి’తెగిస్తున్నారు. ఏకంగా 2వేల కోట్ల రూపాయల పందేలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2019.. ఎన్నికల ఏడాది కావడంతో ముందు నుంచే వీటికి కసరత్తు జరిగింది. పోలీసులూ చూసీచూడనట్లు ఉండాలని వారికి ఆదేశాలు అందినట్టు సమాచారం. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీఎత్తున కోడిపందాలను ప్రోత్సహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఈ పందేలకు ప్రధాన కేంద్రంగా నిలిచింది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్‌ వంటి పోటీలు అని చెప్పి బరులు పెద్దఎత్తున రెడీ చేశారు. కోళ్ల గ్రేడింగ్‌ పూర్తి చేసి పందేలకు అర్హత కలిగిన పుంజులను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆయా ప్రాంతాలకు తరలించేశారు.

పేకాట, కోతాట గుండాట:
కోడి పందేలతో పాటు బరుల పక్కనే పెద్దఎత్తున జూదం జరుగుతుంటుంది. పేకాట, కోతాట, గుండాటల్లో పెద్ద మొత్తాల్లో చేతులు మారుతుంది. 2018లో వెయ్యి కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా. ఈసారి పెద్దగా పోలీసుల ఆంక్షలు లేకపోవడంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేలు, జూదాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు.

* ఒక్కో జిల్లాలో కనీసం భారీ పందేలు వేసేలా 15 పెద్ద బరులు రెడీ
* చిన్నపాటి పందేల కోసం 600 నుంచి 800 బరులు సిద్ధం
* చిన్నపాటి పందాల్లో మినమిమ్ రూ.5 వేల నుంచి లక్ష వరకు పందెం
* భారీ పందేల్లో మినిమమ్ లక్ష నుంచి 5 లక్షల రూపాయల వరకు బెట్టింగ్‌
* ఒక్కో పందెంలో నేరుగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు పందెం వేస్తే దానికి పైపందేలు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు బెట్టింగ్
* ఒక్కో బరిలో రోజుకు కనీసం 15 కోడి పందేలు
* సంక్రాంతి రోజు 24గంటలూ పందేలు
* ఒక్కో బరిలో మూడు రోజుల్లో దాదాపు 60 పందేలు
* కోడిపందేలతో పాటు పేకాట, కోతాట, గుండాట
* కోడి పందాల కంటే జూదంలోనే పెద్దఎత్తున చేతులు మారుతున్న నోట్ల కట్టలు
* 2018 లో ఏపీలో రూ.వెయ్యి కోట్లు చేతులు మారితే ఈ ఏడాది రూ.2వేల కోట్లు మారుతుందని అంచనా