బాసర ట్రిపుల్ ఐటీలో అవినీతి అనకొండలు : వెలుగులోకి తెచ్చిన 10 టీవీ

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 10:44 AM IST
బాసర ట్రిపుల్ ఐటీలో అవినీతి అనకొండలు : వెలుగులోకి తెచ్చిన 10 టీవీ

బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అవినీతిని 10 టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. అక్రమార్కుల నిజస్వరూపాన్ని కెమెరా సాక్షిగా బయటపెట్టింది. అవినీతి కాంట్రాక్టర్ అసలు రూపాన్ని ముసుగు తీసి చూపించింది. కాంట్రాక్టర్ కొండా సంతోష్ మాత్రమే కాదు.. అతడికి సహకరించిన వారిని కూడా ప్రజల ముందు ఉంచింది. బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న అక్రమాల లెక్కలపై… కాంట్రాక్టుల కహానీపై అవినీతి అడ్డా పేరుతో 10 టీవీ కథనాలు ప్రసారం చేయడంతో అక్రమార్కుల కాళ్ల కింది భూమి కదిలిపోయింది. చదువుల నిలయంలో సాగుతున్న అవినీతి కంపుపై వేసిన స్టోరీలు వారికి నిద్ర లేకుండా చేశాయి. అక్రమాలు, అవినీతితో చెలరేగిపోయిన వారు… తమ బాగోతం బయటపడకుండా ఉండేందుకు మరో అడ్డదారిని వెతికారు. కథనాలు ప్రసారం కాకుండా అడ్డుకునేందుకు ప్రలోభాల పర్వానికి తెరలేపి.. టెన్‌ టీవీ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు.

కాంట్రాక్టర్ కొండా సంతోష్.. మొదట తన తరపున ఓ ప్రతినిధిని రంగంలోకి దించాడు. అతడితో బేరసారాలను ప్రారంభించాడు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ దగ్గర టెన్ టీవీ ప్రతినిధిని కలుసుకున్న ఆ మధ్యవర్తి… 25 వేల రూపాయలిస్తానని.. వెంటనే ఆ స్టోరీలు ఆపేయాలని బతిమిలాడాడు. ఆ తర్వాత దానిని 40 వేల రూపాయలకు పెంచాడు. కొండా సంతోష్‌ను డైరెక్ట్‌గా కలవాలని టెన్‌ టీవీ ప్రతినిధి డిమాండ్ చేయడంతో సీన్ పంజాగుట్టలోని ఓ హోటల్‌కు మారింది. కొంతసేపటికి అక్కడికి ఎంట్రీ ఇచ్చారు అసలు సూత్రధారి కొండా సంతోష్. టెన్ టీవీ స్టోరీతో టెన్షన్ పడుతున్న అతగాడు… చెమటలు పట్టిన ముఖంతోనే అక్కడికి చేరుకున్నాడు. టెన్షన్ ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం అదేం లేదని.. తానింతేనని కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. పైకి నవ్వు నటిస్తూ తనని వదిలేయాలని వేడుకున్నాడు.

సీటులో సెటిలైన సదరు కాంట్రాక్టర్ ఆ తర్వాత తన బేరాన్ని మొదలెట్టాడు. ఎంతకావాలో చెప్పాలంటూనే.. తన రేటెంతో చెప్పుకొచ్చాడు. 70 వేలిస్తానని వెంటనే ఆ స్టోరీలు ఆపేయాలని కోరాడు. ఆ తర్వాత దానిని లక్షకు పెంచాడు. ఓవైపు రేటు పెంచుతూనే.. ఈ కాంట్రాక్టులో అసలు తమకు లాభాలే రావంటూ కహానీలు వినిపించాడు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడటం లేదన్న కాంట్రాక్టర్ కొండా సంతోష్.. తనను తాను బిల్డప్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇంతవరకు తనపేరు ఎక్కడా మీడియాలో రాలేదని.. ఫస్ట్ టైమ్ ఇలా మీతో మాట్లాడాల్సి వస్తోందంటూ… తన తప్పులను కూడా ఓ ఘనకార్యంలా ప్రకటించుకునేందుకు యత్నించాడు.

బాసర ట్రిపుల్ ఐటీలోని ఫిల్టర్ బెడ్లు, ఆర్వో ప్లాంట్ల నిర్వహణలో తమ పాత్ర ఎంతో చెప్పిన అవినీతి అనకొండ… దానికోసం తాను నెలకు 60వేల రూపాయలకు పైగా వెచ్చించాల్సి వస్తోందన్నారు. అంతేకాదు.. కేవలం స్విచ్‌ ఆన్‌ చేసి ఆఫ్‌ చేసే వ్యక్తికి నెలకు 25వేల రూపాయల వేతనం ఇస్తున్నానని చెప్పుకొచ్చాడు. మరి.. అక్రమాలే లేకపోతే ఎందుకు అందరిని మేనేజ్ చేస్తున్నారని ప్రశ్నిస్తే… అబ్బే అదేమీ లేదంటూ ఫోజులు కొట్టాడు. ఎవరికీ పెద్దమొత్తంలో డబ్బులివ్వలేదని అప్పుడప్పుడు పార్టీలకు 10వేల రూపాయల చొప్పున ఇస్తానని.. తనకు అలవాటైన పనిని దర్జాగా వివరించాడు.

ఆ తర్వాత మరోసారి కల్పించుకున్న మధ్యవర్తి ఫైనల్‌ రేటు ఇదేనంటూ రెండు లక్షలు ఆఫర్ చేశాడు. ఒప్పుకుంటే ఇక్కడికిక్కడే హాట్ క్యాష్ ఇచ్చేస్తానంటూ చెప్పాడు. అయినా డీల్ కుదరకపోవడంతో మరో లక్ష పెంచాడు. మొత్తం మూడు లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్ కొండా సంతోష్ అన్నాడు. టెన్‌ టీవీ కథనాలతో తనపై నెగటివ్ ఇంప్రెషన్ వచ్చిందని… దానిని మళ్లీ పాజిటివ్ గా మార్చేందుకు ఏం చేయాలో చెప్పుకొచ్చాడు. భవిష్యత్‌లోనూ తన నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత తన కుమారుడితో డబ్బులు తెప్పించి టెన్‌టీవీ ప్రతినిధికి ఇచ్చాడు కొండా సంతోష్. తాను వచ్చిన పని సక్సెస్ అయిందన్న సంతోషంలో ఉన్న సంతోష్.. అక్కడి నుంచి వెళ్లిపోబోతుండగా అసలు మ్యాటర్‌ను రివీల్ చేసింది టెన్‌ టీవీ ప్రతినిధి. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయని చెప్పడంతో అతను హోటల్‌ బయటకు పరుగు తీశాడు. అతడిని ఫాలో అయిన టెన్ టీవీ ప్రతినిధి ఆయన అవినీతి బాగోతంపై మరోసారి ప్రశ్నించింది. డబ్బులిస్తూ అడ్డంగా దొరికిపోయినా .. అసలు తనకేమీ తెలియదని, ఆ డబ్బులు కూడా తనవి కాదని బుకాయించాడు.