కోడెల శివరాంకు కండీషనల్ బెయిల్

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 02:22 PM IST
కోడెల శివరాంకు కండీషనల్ బెయిల్

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తనయుడు కోడెల శివరాంకు బెయిల్ మంజూరు అయింది. నరసరావుపేటలో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఎదుట లొంగిపోయిన శివరాంకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 

టీడీపీ హయాంలో తండ్రి కోడెల శివప్రసాద్ రావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కోడెల శివరాం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కేట్యాక్స్ పేరుతో ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. శివరాంతోపాటు ఆయన సోదరిపై కేసులు నమోదు అయ్యాయి. వీరిద్దరిపై పలువురు బాధితులు 19 కేసులు పెట్టారు. నరసరావుపేట పోలీస్ స్టేషన్ లో శివరాంపై ఆరు కేసులు నమోదయ్యాయి.  

ఇక తనపై నమోదైన కేసుల విషయంలో నరసరావుపేట మొదటి అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో శివరాం లొంగిపోయారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పేర్కొంటూ ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. 

శివరాంకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో కోర్టులో లొంగిపోయి, తర్వాత కండీషనల్ బెయిల్ పై బయటికి వచ్చారు. శివరాంకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు కొన్ని షరతులు విధించింది. నరసరావుపేటలో అడుగు పెట్టొద్దని ఆదేశించింది. వారంలో మూడ్రోజులపాటు విజయవాడలోని పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో సంతకం పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది.