నేటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

  • Published By: vamsi ,Published On : March 18, 2020 / 11:31 PM IST
నేటి నుంచి ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కారణంగా విద్యాసంస్ధలు మూసివేయగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నియంత్రణపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షలో పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు.

ఈ సంధర్భంగా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రజలను ఆందోళనకు గురిచేయకుండా చర్యలు ఉండాలని సూచించారు. అలాగే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, కోచింగ్‌ సెంటర్లకు గురువారం నుంచి సెలవులు ప్రకటించారు.(కరోనా కారణంగా సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా)

ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటన చేశారు. గురువారం(19 మార్చి 2020) నుంచి రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నామని, పదవ తరగతి పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని వెల్లడించారు. హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను దగ్గరుండి ఇళ్లకు పంపిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సులలో వారిని ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.