గుంటూరులో ఆదివారం పూర్తి కర్ఫ్యూ

  • Published By: chvmurthy ,Published On : April 11, 2020 / 03:27 PM IST
గుంటూరులో ఆదివారం పూర్తి కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఆదివారం ఏప్రిల్12న పూర్తిగా  కర్ఫ్యూ అమలు  చేస్తామని కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ రాజ్ ప్రకటించారు. రాష్ట్రంలో కర్నూలు తర్వాత అత్యధిక  కరోనా పాజిటివ్ కేసులు గుంటూరు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ  నేపధ్యంలో ఆదివారం నుంచి జిల్లాలో ఆంక్షలు మరింత కఠినంగా అమలు చేయనున్నారు. శుక్రవారం రాత్రి  10 గంటల నుంచి శనివారం సాయంత్రం వరకు జిల్లాలో 17 పాజిటివ్ కేసులు రావటంతో అధికారులు ఈ  నిర్ణయం తీసుకున్నారు. 
 
జిల్లాలో మొదటి కరోనా  పాజిటివ్ వచ్చిన వ్యక్తి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినప్పటికీ, నానాటికీ  పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 12 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లకు అనుమతిస్తామన్నారు. మెడికల్ షాపులు తప్ప ఇతర షాపులేవీ తెరిచి ఉండబోవని కలెక్టర్ తెలిపారు. హోం డెలివరీ సదుపాయాన్ని వాడుకోవాలని ప్రజలకు సూచించారు.

జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ మాస్కులు లేకుండా తిరగడాన్ని నిషేధించారు. ప్రజలు రోడ్లపైకి మాస్కు లేకుండా వస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని, పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉంటే 104 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫిర్యాదు చేయాలి..క్వారెంటైన్ లో ఉన్న వారికి 500 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. 

యువకుల్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం ఆలస్యంగా వైరస్ బయట పడుతుంది…ఇంట్లో ఉన్న పెద్ద వారు కోసం అయిన మాస్క్ ధరించాలి, దూరం పాటించాలి…ఏ ప్రార్థనలు మీటింగ్స్ అనుమతి లేదు నిర్వహించిన పక్షంలో అట్టి వారిపై కేసులు నమోదు చేస్తాం. కొంత మంది వ్యక్తులు వాకింగ్ కోసం ఉదయం పూట బయటకు వస్తున్నారని వారుకూడా  బయటకు రాకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.