కార్పొరేట్ కు ధీటుగా : ఆకాశంలో సర్కారు బడి రాకెట్లు

  • Published By: veegamteam ,Published On : March 1, 2019 / 06:24 AM IST
కార్పొరేట్ కు ధీటుగా : ఆకాశంలో సర్కారు బడి రాకెట్లు

సిరిసిల్ల : కార్పొరేట్‌ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా సర్కారు బడి విద్యార్ధులు తమ ప్రతిభను చాటుతున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లోనే కనిపించే ప్రయోగాలు..వర్క్ షాపులకు సిరిసిల్ల సర్కారు బడి వేదికయ్యింది. సైన్స్‌డే సందర్భంగా ఫిబ్రవరి 28న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బెంగుళూరు రాకెట్రీ అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులతో రాకెట్‌ ప్రయోగాలు చేయించారు. 
 

రాకేట్రీ వర్క్‌షాపునకు రూ1.40 లక్షలు ఖర్చు కాగా..వాటిని భారతి ఫౌండేషన్‌తో పాటు సిరిసిల్ల కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ ఖర్చును భరించారు. సిరిసిల్లలోని పది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 350 మంది విద్యార్థులను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో  100 జట్లుగా ఏర్పాటు చేసి..వారితో  100 రాకెట్లను తయారు చేయించారు. ఇస్రో శాస్త్రవేత్తలు దివ్యాన్ష్‌, ఆకాష్‌ ఆధ్వర్యంలో రాకెట్‌ తయారీలోని టెక్నిక్స్ ను.. సైన్స్‌ సూత్రాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం రాకెట్లను సిరిసిల్ల మానేరు తీరంలోని బతుకమ్మ ఘాట్‌ వద్ద విజయవంతంగా ప్రయోగించారు. తాము చేసిన రాకెక్టు ఆకాశంలో దూసుకుపోవటంతో విద్యార్థులంతా కేరింతలు కొట్టారు. భవిష్యత్తులతో తాము కూడా రాకెట్టు తయారు చేస్తామని ఆత్మ విశ్వాసంతో చెప్పారు సర్కార్ బడి విద్యార్ధులు.