ఆధ్యాత్మిక పరిమళాలు : ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 12:59 AM IST
ఆధ్యాత్మిక పరిమళాలు : ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ

దసరా అంటేనే బెజవాడలో ఒక పండుగ.. ఇంద్రకీలాద్రితో పాటు నగరం మొత్తం విద్యుత్ కాంతులతో విరజిల్లుతుంది. ఆశ్వయుజ మాసంలో 10 రోజులపాటు జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దుర్గగుడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 
ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆదివారం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉదయం 9 గంటలకు స్నపనాభిషేకం అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. 10 రోజులు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిస్తుంది. ఉత్సవాల్లో రెండో రోజు నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కొనసాగుతుంది. ఈ ఉత్సవాలకు ఏపీ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలిరానున్నారు. 

మరోవైపు అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం రోజైన అక్టోబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మూల నక్షత్రం రోజున ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుంది. అందువల్ల ఆ రోజు వీఐపీల దర్శనం రద్దు చేశారు. అన్ని క్యూలైన్లను సర్వదర్శనాలకే కేటాయించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.

అక్టోబర్‌ 8న అమ్మవారి తెప్పోత్సవం కృష్ణానదిలో కనుల పండువగా జరపనున్నారు. హంస వాహనంపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్లు వేద మంత్రాలు, అర్చకుల ప్రత్యేక పూజల మధ్య నదీ విహారం చేయనున్నారు. దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా లక్ష కుంకుమార్చన, విశేష చండీహోమం నిర్వహిస్తారు. 
Read More : గవర్నర్ ను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన టీటీడీ చైర్మన్