ఏపీకి ఢిల్లీ నిజాముద్దీన్ టెన్షన్.. ఆ మూడు జిల్లాల్లో హైఅలర్ట్, భయాందోళనలో ప్రజలు

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 04:30 AM IST
ఏపీకి ఢిల్లీ నిజాముద్దీన్ టెన్షన్.. ఆ మూడు జిల్లాల్లో హైఅలర్ట్, భయాందోళనలో ప్రజలు

నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరగడానికి ఇదే కారణం అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాలకు కూడా ఢిల్లీ దడ పట్టుకుంది. దానికి కారణం నిజాముద్దీన్ మర్కజ్ మసీదే. అక్కడ జరిగిన మతపరమైన ప్రార్థనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది పాల్గొన్నారు. ఇప్పుడీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను బెంబేలెత్తిస్తోంది.

ప్రార్థనల్లో పాల్గొన్న 2వేల మంది భారతీయులు:
తెలంగాణలో ఏకంగా ఆరుగురు కరోనాతో చనిపోవడం, ఆ ఆరుగురూ ఢిల్లీలో మర్కజ్‌లో ప్రార్థనల కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 13 నంచి 15 తేదీల మధ్య ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీద్ లో నిర్వహించిన ప్రార్థనల్లో 2వేల మంది పాల్గొన్నారు. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇతర దేశాల నుంచి మత పెద్దలు వచ్చారు. 2వేల మంది భారతీయులు ఈ ప్రార్థనల్లో పాల్గొనగా.. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం, ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిపై ఫోకస్:
మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అక్కడికి వెళ్లొచ్చిన వారిపై దృష్టి చేసింది. ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతొక్కరి సమాచారాన్ని సేకరిస్తోంది. వారికి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స అందచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొందర్ని ఐసోలేషన్ వార్డులకు తరలించారు. 

ఏపీలో 3 జిల్లాల్లో హైఅలర్ట్:
ఏపీలో తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లా వాసులు ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చినట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో మూడు కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు ఢిల్లీ వెళ్లొచ్చారు. దీంతో అధికారులు పాజిటివ్ కేసులు ఉన్న వ్యక్తులతో తిరిగినవారిపై ఫోకస్ పెట్టారు. వారిని ఐసోలేషన్ వార్డులకు తరలించే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరు ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎవర్ని కలిశారు అనేది ఆరా తీస్తున్నారు. అలాగే పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో శానిటేషన్ ప్రక్రియ చేపట్టారు. స్థానికులను కూడా అప్రమత్తం చేశారు. వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో గుంటూరు జిల్లా ఎమ్మెల్యే బంధువు:
గుంటూరు జిల్లాలోనూ పలువురు వ్యక్తులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిలో ఉన్నారు. జిల్లాలో నమోదైన మొదటి కేసు గుంటూరుకు చెందిన వ్యక్తిది. ఈయన ఓ ప్రజా ప్రతినిధికి(ఎమ్మెల్యే) బంధువు. ఈయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత స్థానికులకు విందు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విందుకు ఆ ఎమ్మెల్యే హాజరయ్యారని వార్తలొచ్చాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తి తన బంధువేనని కాకపోతే ఢిల్లీ వెళ్లొచ్చిన సంగతి తనకు తెలియదని ఆ ఎమ్మెల్యే చెప్పారు. ఆ ఎమ్మెల్యే, ఆయన ఫ్యామిలీని అధికారులు ఐసోలేషన్ వార్డులో ఉంచారు. మాచర్ల ప్రాంతంలోనూ కొందరు ఢిల్లీ వెళ్లొచ్చారని తెలియడంతో వారిని గుంటూరు ఐసోలేషన్ వార్డుకు తరలించారు అధికారులు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన 280మందిలో 200మంది గుర్తింపు:
ప్రకాశం జిల్లా చీరాలలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడిన సంగతి తెలిసిందే. భార్య, భర్తలకు కరోనా సోకింది. ఇద్దరు చీరాల కరోనా బాధితులు 280 మందితో కూడిన బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆ బృందంలోని 200 మందిని గుర్తించి ఐసోలేషన్‌, క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి చెప్పారు. ప్రస్తుతం వారికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందన్నారు. మిగతా 80 మందిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయన్నారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన బృందంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు బయటపడటం వీరి వెంట అధిక సంఖ్యలో జనాలు ఉండటం ఆందోళన రేపుతోంది. ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఢిల్లీ ట్రావెల్ హిస్టరీ ఉన్నవారిపై ఫోకస్ పెట్టింది. ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువమంది వివరాలు సేకరించారు.. మిగిలిన వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. పాజిటివ్ ఉన్నవారితో సన్నిహితంగా మెలిగినవారిపై ఫోకస్ పెట్టారు. 

తెలుగు రాష్ట్రాల నుంచి 2వేల మంది హాజరు:
సౌత్ ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో మర్కజ్ మసీద్ లో రెండున్నర రోజులపాటు ఒక సదస్సు జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 వేల మంది హాజరయ్యారు. వీరిలో అత్యధికులు మార్చి 14-15వ తేదీల్లో తమ ప్రాంతాల నుంచి రైళ్లలో బయలుదేరారు. 16, 17, 18వ తేదీ మధ్యాహ్నం వరకు జరిగిన సదస్సులో పాల్గొన్నారు. 15 నుంచి 20 మందితో కూడిన బృందాలుగా వెళ్లిన వారంతా కలిసే ప్రయాణించారు. ఢిల్లీలో ఉన్నన్ని రోజులు కలిసే బస చేశారు. ఆ తర్వాత రైళ్లలో బృందాలుగా వచ్చారు. ఏపీకి చెందిన వారు దురంతో ఎక్స్‌ప్రెస్‌, ఏపీ ఎక్స్‌ప్రెస్ లలో ప్రయాణించారు.

శ్రీనగర్ లో కరోనాతో మతపెద్ద మరణం, ఆ తర్వాత మొదలైన కలకలం:
ఢిల్లీకి వెళ్లి వచ్చిన ఒక మతపెద్ద గత వారం శ్రీనగర్‌లో కరోనాతో చనిపోయాడు. ఆ వెంటనే కలకలం మొదలైంది. ఏపీ‌, తెలంగాణలో నిర్ధారణ అయిన కరోనా కేసుల్లోనూ ‘ఢిల్లీ కనెక్షన్‌’ బయటపడింది. ఇక… ఢిల్లీలోని సదరు మత సమావేశం జరిగిన సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న నిజాముద్దీన్‌ ప్రాంతంలో అనేక మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వీరు కూడా సదరు సమావేశానికి హాజరైనట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆదివారం(మార్చి 29,2020) రాత్రి ఆ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు, పారామిలటరీ బలగాలు స్వాధీనంలోకి తీసుకున్నాయి. వైద్య సిబ్బంది రంగంలోకి దిగారు. 163 మంది అనుమానితులను ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సదరు సమావేశం జరిగిన ‘మర్కజ్‌ భవంతి’ వైపు ఇతరులెవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. 

పారామిలటరీ బలగాల ఆధీనంలో నిజాముద్దీన్:
ఎవ్వరూ బయటికి రాకుండా డ్రోన్లతో నిఘా పెట్టారు. కరోనా అనుమానితులను ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా బస్సులను కూడా సిద్ధం చేశారు. పశ్చిమ నిజాముద్దీన్‌, నిజాముద్దీన్‌ బస్తీలో దాదాపు 30 వేల మంది నివసిస్తున్నారు. మర్కజ్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం(మార్చి 30,2020) ఆదేశించారు.

మొత్తగా ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ మసీద్.. ఏపీలో కలకలానికి దారి తీసింది. పరిస్థితి అదుపులోకి వచ్చింది, కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది అని ప్రభుత్వాలు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి వైరస్ సోకడం ఆందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీంతో ప్రభుత్వాలు, ప్రజలు వర్రీ అవుతున్నారు.

ఏపీ నుంచి ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొన్నవారు, జిల్లాల వారీగా:
కర్నూలు – 189
గుంటూరు – 88
అనంతపురం – 73
ప్రకాశం – 67
నెల్లూరు – 68
కడప – 59
కృష్ణా – 43
విశాఖ – 42
చిత్తూరు – 36
తూ.గో – 27
ప.గో. – 16
విజయనగరం – ముగ్గురు హాజరు

Also Read | దొరికిన కాడికి దోచుకోవటమే… క్వార్టర్ @ 300