ఉ.11 వరకే నిత్యవసరాలు, ఏపీలో మారిన లాక్‌డౌన్ రూల్స్, మరింత కఠినం

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 09:36 AM IST
ఉ.11 వరకే నిత్యవసరాలు, ఏపీలో మారిన లాక్‌డౌన్ రూల్స్, మరింత కఠినం

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. లాక్ డౌన్ రూల్స్, జనాలు బయట తిరిగే టైమింగ్స్ ను ప్రభుత్వం మార్చింది. లాక్ డౌన్ నేపథ్యంలో నిత్యవసరాల కొనుగోలు కోసం ప్రభుత్వం కొంత సమయం కేటాయించింది. తాజాగా అర్బన్ ప్రాంతాల్లో(పట్టణాల, నగరాలు) ఆ సమయాన్ని ప్రభుత్వం మరింత కుదించింది. ఇప్పటివరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజలు బయట తిరిగే వెసులుబాటు ఉండేది. ఇకపై పట్టణాలు, నగరాల్లో ఉదయం 6 నుంచి 11 గంటల వరకే నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయాలి. అంతవరకే అనుమతి ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే ప్రజలు బయట తిరగాలి. ఉదయం 11 తర్వాత ప్రజలెవరూ బయటకు రాకూడదు. గ్రామాల్లో మాత్రం నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటించారు.

బయట తిరిగే సమయాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లిందట. దీనికి తోడు నిపుణల సూచనల మేరకు ప్రజలు బయట తిరిగే సమయాన్ని కుదించినట్టు మంత్రి చెప్పారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు బయటకు రావాలని, అది కూడా నిత్యవసరాలు కొనుగోలు చేసేందుకే మాత్రమేనని మంత్రి తేల్చి చప్పారు. అలాగే ప్రజలు ఒక్కసారిగా బయటకు రావద్దని సూచించారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య 19కి పెరిగింది. నిన్న(మార్చి 28,2020) ఒక్క రోజే 6 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. లాక్ డౌన్ రూల్స్ ని మరింత కఠినం చేసింది. లాక్‌డౌన్‌ అమలు, తీసుకుంటున్న చర్యలకు సంబంధించి ఆదివారం(మార్చి 29,2020) ఆయన మీడియాతో మాట్లాడారు. 

నిత్యవసర వస్తువులు అధిక ధరలకు అమ్మితే జైలుకే:
నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. జైలుకి పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. నిత్యావసరాలకు ఏ కొరత లేకుండా చూస్తామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. నిత్యావసర వస్తువుల విక్రయాలపై కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సీఎం జగన్‌ ఆదేశించారని మంత్రి తెలిపారు. ప్రతి షాపు ముందు నిత్యావసర వస్తువుల ధరల పట్టిక ఏర్పాటు చేయడంతో పాటు.. ఫిర్యాదు చేసేందుకు కాల్‌ సెంటర్‌ నంబర్‌ కూడా పట్టికలో చూపించాలన్నారు. వ్యవసాయ కూలీల రాకపోకలను అడ్డుకోవద్దని సీఎం జగన్‌ చెప్పారని మంత్రి వెల్లడించారు. ఎక్కడా వ్యవసాయ ధరలు పడిపోవడానికి వీల్లేదని, అందుకోసం మొబైల్ మార్కెట్స్‌ ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రజలు మధ్యాహ్నం వరకు బయటకు వచ్చే అవకాశం లేకుండా ఎక్కడికక్కడ భారీ ఎత్తున కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో కూరగాయలు ఉంటే, ప్రజలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదన్నారు. 

ఏపీలోకి రావాలంటే క్వారంటైన్ మస్ట్:
గ్రామ వాలంటీర్లు సర్వేను మరింత పటిష్టంగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని చెప్పారు. అత్యవసరంగా వచ్చినా.. క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు. విదేశాల నుంచి వచ్చినవారిని పూర్తి స్థాయిలో గుర్తిస్తున్నామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవారికి అన్ని సదుపాయాలు కల్పించాలని సీఎం జగన్‌ చెప్పినట్టు మంత్రి వెల్లడించారు. నగరాలు, పట్టణాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారని మంత్రి అన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు 1902 నెంబర్ కు కాల్ చేయాలని మంత్రి చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున అక్కడ నివారణ చర్యలను మరింత పటిష్టం చేస్తామన్నారు. మళ్లీ రీ సర్వే చేసి అనుమానితులను క్వారంటైన్ తరలించాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 979కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 25మంది కరోనాతో చనిపోయారు. 867 మంది భాతులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి 86మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కి పెరిగింది. గుజరాత్ లో నలుగురు, కర్నాటకలో ముగ్గురు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లో ఇద్దరు చొప్పున కరోనాతో చనిపోయారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, బెంగాల్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. శనివారం(మార్చి 28,2020) మహారాష్ట్రలో కరోనాతో మరొకరు చనిపోయారు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 40 ఏళ్ల మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కి పెరిగింది. మహారాష్ట్రలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 193కి పెరిగింది.