ఆత్మహత్యలు చేసుకోవద్దు : ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లకంటే అపోహలే ఎక్కువ

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 08:11 AM IST
ఆత్మహత్యలు చేసుకోవద్దు : ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లకంటే అపోహలే ఎక్కువ

నల్గొండ : ఇంటర్ ఫలితాల్లో పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అపోహలను నమ్మొద్దని విద్యార్థులను మంత్రి కోరారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై త్రిసభ్య కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జగదీశ్‌రెడ్డి చెప్పారు. నివేదిక వచ్చాక సాంకేతిక సమస్య ఉంటే సంస్థపై, మానవ తప్పిదతమైతే అధికారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఇంటర్ ఫలితాలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అనేక తప్పులు జరిగాయి. విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మంచి మార్కులతో పాస్ అవుతామని భావించిన విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో 16మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇంటర్ బోర్డు నిర్వాకంతో స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. పిల్లల చదువులపై ప్రభావం పడింది. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో తల్లిదండ్రులు కూడా వర్రీ అవుతున్నారు. తమ పిల్లలకు న్యాయం చేయాలని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.