వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

  • Published By: veegamteam ,Published On : March 15, 2019 / 03:50 AM IST
వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తలకు గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు, పర్సనల్ సెక్రటరీ, అనుచరులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకా మృతిపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు, అనుచరులు ఫిర్యాదు చేశారు. వివేకా మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు చెప్పారు. వివేకా పార్థివదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.
Read Also: బాత్రూంలో ఏం జరిగింది : వివేకానందరెడ్డి మృతిలో 5 అనుమానాలు

నిన్నటి వరకు వైసీపీ కార్యకలాపాలు, ఎన్నికల ప్రచారంలో వివేకా చురుగ్గా పాల్గొన్నారు. కడప జిల్లా చాపాడు మండలం మద్దూరులో వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గురువారం రాత్రి 8.30 వరకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆయన తనయుడు అశోక్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. రాత్రికి ఇంటికి వచ్చి పడుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూమ్ కి వెళ్లారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాత్ రూమ్ లోకి వెళ్లి చూశారు. అక్కడ రక్తపుమడుగులో పడి ఉన్న వివేకాను చూసి వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వివేకా తలపై గాయాలు ఉండటం గమనించారు. అసలేం జరిగింది? అనేది వారికి అర్థం కాలేదు. కాగా, గుండెపోటుతో వివేకానందరెడ్డి హఠానర్మణం చెందారని, పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం (మార్చి 15) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని వార్తలు వచ్చాయి. ఇంతలోనే కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.

నిన్న వరకు చలాకీగా, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే పరిస్థితి లేదని వివేకా కుటుంబసభ్యులు, అనుచరులు అంటున్నారు. గతంలో ఆయనకు గుండె జబ్బులు వచ్చిన దాఖలాలు లేవన్నారు. బాత్ రూమ్ లో కాలు జారిపడి తలకు గాయాలు కావడంతో చనిపోయారా మరో కారణమా అనేది పోలీసుల విచారణ, పోస్టుమార్టం అనంతరం తెలియనుంది.

1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకా జన్మించారు. వైఎస్ కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టారు. 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో వ్యయసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వివేకానందరెడ్డి సౌమ్యుడిగా పేరు పొందారు.

తనకు సాయం చేయమని అడిగిన వారి కోసం ఎంతవరకైనా వెళ్లేవారు. రాజకీయాల్లో వైఎస్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ అజాత శత్రువుగా ఉన్నారు. సౌమ్యునిగా పేరున్న వివేకానందరెడ్డి మరణం కుటుంబంలోనే కాదు వైసీపీ శ్రేణులు, వైఎస్ అభిమానుల్లోనూ విషాదం నింపింది. జగన్ షాక్ కు గురయ్యారు. రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. వారు షాక్ తిన్నారు. ఎలా జరిగింది అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు,. అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.