‘డ్రైవ్ ఇన్ సినిమా’ వాహనాల్లోనే కూర్చునే సినిమా చూడొచ్చు..

  • Published By: nagamani ,Published On : August 19, 2020 / 10:10 AM IST
‘డ్రైవ్ ఇన్ సినిమా’ వాహనాల్లోనే కూర్చునే సినిమా చూడొచ్చు..

కరోనా మహమ్మారి సరికొత్త ఆలోచనలకు రూపునిస్తోంది. కొత్త ఆలోచనలు..వినూత్న పద్ధతులకు మనుషుల్ని క్రమంగా అలవాటు చేస్తోంది. తినే తిండి నుంచి ఆస్వాదించే వినోదం వరకూ అన్నీ మార్పులే..ఎన్నడూ ఊహించని మార్పులే. లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిపోయిన జనం ఎంటైర్ టైన్ మెంట్ కు పూర్తిగా దూరమైపోయారు. ఎంటైర్ టైన్ మెంట్అంటే ముందుగా గుర్తుకొచ్చేది సినిమా. ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉన్నా ఆఖరికి హోం థియేటర్ ఉన్నా సరే..సినిమా థియేటర్ కు వెళ్లి చూడటంలో ఆ కిక్కే వేరుగా ఉంటుంది.కానీ లాక్ డౌన్ తో థియేటర్స్ అన్నీ 5 నెలలుగా సినిమాలు లేక జనం కూడా ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఎంతకీ తగ్గని కరోనా మహమ్మారి వల్ల థియేటర్స్ తెరవటానికే భయపడుతోంది ప్రభుత్వం.



కానీ కరోనాతో వచ్చిన కొత్త ఆలోచనతో దేశ రాజధాని ఢిల్లీలో ఓ సరికొత్త థియేటర్ అందుబాటులోకి వచ్చింది. అదే ‘డ్రైవ్ ఇన్ సినిమా’.ఎప్పుడో 70వ దశకంలో ఏర్పాటైన ‘డ్రైవ్ ఇన్ సినిమా’ స్క్రీనింగ్‌కు నేటి లాక్ డౌన పరిస్థితుల్లో మంచి ఆదరణ లభించింది. సినిమా చూడాలనుకునే వారు కారులోనే కూర్చొని దర్జాగా చూసేయవచ్చు. ఎన్సీఆర్ ప్రాంతంలో ఉన్న సన్ సెట్ సినిమా క్లబ్ నిర్వాహకులు తొలి షోను ఇటీవల ప్రారంభించారు. దీనికి జనం నుంచి మంచి ఆధరణ లభించింది. ఈ పరిస్థితుల్లో ఈ ‘డ్రైవ్ ఇన్ సినిమా’ను జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.



30 అడుగుల వెడల్పు ఉండే స్కీన్ ముందు కార్లు పార్కింగ్ చేసుకోవచ్చు. అక్కడ వాహనం నిలిపి అందరూ మాస్క్ లు పెట్టుకుని వారి వారి వాహనాల్లోనే కూర్చుని సినిమా చూడవచ్చు. ఆడియో కూడా నేరుగా కారులోకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. దీంతో కరోనా భయం లేకుండా సినిమా థియేటర్ అనుభూతిని పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.



1970 సమయంలో మన దేశంలో ఇలాంటి థియేటర్లు అందుబాటులోకి వచ్చినట్లుగా సమాచారం. దేశ వ్యాప్తంగా కేవలం ఆరు ప్రాంతాల్లో మాత్రమే ఇవి ఉన్నాయి. అందులో అహ్మదాబాద్, ముంబై ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఉండగా.. ఢిల్లీ శివారు ప్రాంతాల్లో మరో నాలుగు ఉన్నాయి. కొంత కాలానికే ఇవి మూతపడగా..కానీ ఇటీవల గురుగ్రామ్‌లోని సన్ సెట్ సినిమా క్లబ్ తొలి ప్రదర్శన ఇచ్చింది. ఈ నెల 22,23 తేదీల్లో కూడా సినిమాలు వేస్తామని చెప్పింది. ఇదే డిమాండ్ కొనసాగితే సెప్టెంబర్ నుంచి ప్రతి వారం సినిమా ప్రదర్శన చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి ఎప్పుడో మూతపడిన ఈ తరహా థియేటర్లు, లాక్‌డౌన్ పుణ్యమా అని ఇప్పుడు అందుబాటులోకి రావడం అందరిని ఆకట్టుకుంటోంది.