కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భూకంపం : భయంతో పరుగులు తీసిన జనం

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 12:59 AM IST
కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భూకంపం : భయంతో పరుగులు తీసిన జనం

తెలుగు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 3 జిల్లాల్లో భూమి కంపించింది. ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూకంపం వచ్చింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం(జనవరి 25,2020) అర్ధరాత్రి స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. అర్ధరాత్రి 2.35 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. జగయ్యపేట, ముక్త్యాల, గండ్రాయి, చిల్లకల్లులో 8 సెకన్ల పాటు భూమి కంపించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

అటు గుంటూరు జిల్లాలోనూ భూమి కంపించింది. గుంటూరు జిల్లాలోని బెల్లంకొండ, పిడుగురాళ్ల, మాచవరంలో అర్థరాత్రి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అటు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోనూ భూమి కంపించింది. సూర్యాపేటలో అర్థరాత్రి 2.37 గంటలకు భూప్రకంపనలు వచ్చాయి. హుజూర్ నగర్, మేళ్లచెరువు చింతలపాలెం పాలకీడులో అర్థరాత్రి కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డారు. స్వల్ప ప్రకంపనలు కావడంతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్పారు. అప్పుడప్పుడు భూమి పొరల్లో స్వల్ప ప్రకంపనలు రావడం సహజమే అంటున్నారు.

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోనూ భూమి కంపించింది. నాగులవంచ, బస్వాపురం, పాతర్లపాడులో 3 సెకన్ల పాటు భూమి కంపించింది.