జూరాల వద్ద టెన్షన్ : నిల్వ నీరు విడుదల

  • Edited By: madhu , January 6, 2019 / 04:50 AM IST
జూరాల వద్ద టెన్షన్ : నిల్వ నీరు విడుదల

మహబూబ్ నగర్ : జూరాల ప్రాజెక్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వనపర్తి ఆర్డీవో ఆధ్వర్యంలో నిల్వ నీటిని అధికారులు విడుదల చేయడమే ఇందుకు కారణం. నీటిని ఎలా విడుదల చేస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు విడుదల చేస్తే భవిష్యత్‌లో తాగు నీరు ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. జనవరి 06వ తేదీ ఉదయం జూరాల ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆర్డీవో, ఇతర అధికారులు నీటిని విడుదల చేశారు. సమాచారం అందుకున్న రైతులు అక్కడకు చేరుకుని నీటి విడుదలను వ్యతిరేకించారు. హెడ్ రెగ్యూలేటర్ వద్ద ఆయుకట్టు రైతులు బైఠాయించారు. ప్రాజెక్టు వద్ద రైతులు ధర్నాకు దిగి ఆర్డీవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయుకట్టు రైతులకు ప్రాజెక్టు నీరందిస్తూ వస్తోంది. నిల్వ నీటిని విడుదల చేయడం వల్ల సాగునీరు అందే అవకాశం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. నాలుగున్నర టీఎంసీల నీరు మాత్రమే ఉందని..ఈ నీటిని ఎలా వాడుకొంటారని ప్రశ్నిస్తున్నారు. తాము మాత్రం ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు.