పెట్రోల్‌తో వెళ్లిన రైతు: నేను అంటించుకుని, నిన్ను చంపేస్తా

  • Published By: vamsi ,Published On : November 7, 2019 / 03:51 AM IST
పెట్రోల్‌తో వెళ్లిన రైతు: నేను అంటించుకుని, నిన్ను చంపేస్తా

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్ఆర్ఓ విజయా రెడ్డి సజీవదహనం తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు దిగుతున్న సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు ఎమ్ఆర్ఓలు ముందు జాగ్రత్తలు తీసుకుంటుండగా.. లేటెస్ట్‌గా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకలపాడులో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతు భరోసా గ్రామ సభ ఏర్పాటు చేశారు అధికారులు. ఆ సభకు వచ్చిన అల్లు జగన్‌ అనే రైతు గ్రామ పంచాయతీ కార్యదర్శి జె.సుమలతపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా పొలంలో మురికి కాలువ తవ్విస్తావా? అంటూ మండిపడ్డారు. నాకు ప్రభుత్వం నుంచి ఏ పథకం రాకుండా చేస్తావా? అని దుయ్యబట్టాడు. ఇదే క్రమంలోనే తన వెంట తెచ్చుకుని పెట్రోల్ బాటిల్ తీసి పోసుకున్నాడు. నేను అంటించుకుని, నిన్ను చంపేస్తా.. అంటూ ఊగిపోయాడు. అయితే పక్కనే ఉన్నవాళ్లు అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 

ఇదే సమయంలో పెట్రోల్ పక్కన ఉన్నవారి మీద కూడా పడడంతో అందరూ బయపడిపోయారు. అగ్గిపుల్ల తీయడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు గ్రామస్తులు. ఈ ఘటనతో మహిళా అధికారులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పంచాయతీ కార్యదర్శి సుమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రైతును అరెస్ట్ చేశారు. ఘటనపై వివరాలు అడిగి వెంటనే స్పందించారు మంత్రి ధర్మాన కృష్ణదాస్‌. ఫోన్‌లో పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు.