వ్యాపారుల మాయాజాలం : పాపం..వేరుశనగ రైతులు

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 12:46 PM IST
వ్యాపారుల మాయాజాలం : పాపం..వేరుశనగ రైతులు

మహబూబ్ నగర్ : ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక వేరుశనగ రైతులు విలవిలలాడుతున్నారు.. ప్రభుత్వ మద్దతు ధరను పట్టించుకోకుండా వ్యవసాయమార్కెట్‌ వ్యాపారస్తులు అమాంతం ధరలు తగ్గించేస్తున్నారు.. తెచ్చిన అప్పులు తీర్చడానికి ఎంతోకొంతకు అమ్ముకోవడం తప్ప చేసేదేమీ లేదంటున్నారు వనపర్తి జిల్లాలోని వేరుశనగ రైతులు..
ప్రభుత్వ మద్దతు ధర రూ.4,850
అత్యధికంగా ధర రూ.6,300
మూడు రోజుల్లో రూ.4,200
ప్రభుత్వ మద్దతు ధర రూ.4,500
గరిష్టంగా రూ.5,800 
కనిష్టంగా రూ.4,200

తెలంగాణలో వేరుశనగ పంటకు పెట్టింది పేరుగా ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లా.. ఈ జిల్లాలో చాలా మంది రైతులు వేరుశనగ సాగు చేస్తుంటారు.. అత్యధికంగా ఇక్కడి నుంచే వేరుశనగ దిగుబడి అవుతుంది.. వేరుశనగ మార్కెట్‌గా వనపర్తి జిల్లా మార్కెట్‌ పేరు గాంచింది. అయితే ప్రస్తుతం ఇక్కడ వేరుశనగ రైతులు మద్దతు ధర అందక విలవిలలాడున్నారు.
వేరుశనగ పంటకు ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు 4వేల850రూపాయలు ఉండగా మూడు రోజుల క్రితం అత్యధికంగా 6వేల300 రూపాయల ధర పలికింది. దీంతో మార్కెట్‌కు ఎక్కువ మొత్తంలో వేరుశనగ తీసుకొచ్చారు రైతులు..మూడురోజుల్లోనే మార్కెట్‌ ధర 4వేల200లకు పడిపోయింది. వేరుశనగ ధర తగ్గిపోవడానికి  స్థానిక మార్కెట్‌ వ్యాపారస్తుల నిర్వాకమేనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్ లో రైతుల నుంచి దాన్యం కోనుగోలు చేసే వ్యాపారస్తులు రైతులకు బుక్ చిట్టీలు ఇస్తున్నారని, ఇక్కడ వ్యాపారస్తులు ఆడిందే ఆట పాడిందే పాటగా వనపర్తి మార్కెట్‌ తయారైందని వాపోతున్నారు రైతులు.. ప్రభుత్వ మద్దతు ధరను కూడా పట్టించుకోకుండా వారికి ఇష్టమొచ్చినట్లుగా కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…
వ్యాపారుల మాయాజాలం…
వ్యాపారుల మాయాజాలం కారణంగానే రేటు పడిపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర 4,500 కంటే తక్కువగా కొనుగోలు చేశారంటే రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చని రైతు సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇతర ప్రాంతాలనుంచి వ్యాపారస్తులు రాకపోవడంతో వనపర్తి మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు క్వింటాలుకు గరిష్టంగా 5వేల800లు కనిష్టంగా 4వేల200 వరకు మాత్రమే ధర నిర్ణయించారు. తేమ శాతాన్ని యంత్రాలతో  చూడకుండా గుడ్డిగా ధర నిర్ణయించడం ఎంత వరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగకు మద్దతు ధర వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్నారు.