జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండగే పండుగ

  • Published By: vamsi ,Published On : September 29, 2019 / 07:38 AM IST
జగన్ పథకాలు: అక్టోబర్ లో అమల్లోకి.. ఏపీ ప్రజలకు పండగే పండుగ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి జగన్ ప్రభుత్వం నాలుగు నెలల లోపే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన నవరత్నాల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకోబోయే కీలకమైన నిర్ణయాలు చాలావరకు అక్టోబర్ నెలలో అమలు కానున్నాయి. సమూల మార్పులు దిశగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇచ్చిన హామీల ప్రకారం అక్టోబర్ నెలలో ఏపీలో పండుగ వాతారణం నెలకొల్పేలా చేస్తున్నది.

ఈ క్రమంలోనే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచే జగన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు అమలులోకి రానున్నాయి. మొదటగా అక్టోబర్ ఒకటవ తేదీన ఎక్కడా బెల్టు షాపులు ఉండకుండా అసలు ఆ పేరే వినిపించకుండా.. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాల సమీపంలో మద్యం దుకాణాలు ఉండకుండా.. ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహించేలా జగన్ తీసుకున్న నిర్ణయం అమలులోకి రానుంది.

తద్వారా బెల్ట్‌ షాపులు లేకుండా చేసి మద్యం అమ్మకాలను తగ్గించి సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలనేది సీఎం కోరిక. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం దుకాణాలుంటే బెల్ట్‌ షాపులకు తెర పడదు. అందుకే ప్రభుత్వం మద్యం షాపులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

అలాగే ఏపీ ప్రభుత్వం ఇటీవల మూసేసిన “అన్న క్యాంటీన్లు” వైఎస్ఆర్ పేరుతో అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవనున్నాయి. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయపాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. అలాగే అక్టోబర్ 2వ తేదీనే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

ఇక అక్టోబర్ 4వ తేదీన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేలు సాయం అందించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఏడాదికి రూ.10వేలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సొంతంగా ఆటో, మాక్సీక్యాబ్‌, టాక్సీ డ్రైవర్ల నడుపుకునే వారికి చేయూతను ఇస్తోంది ఈ పథకం. అక్టోబర్‌ 4వ తేదీనే సాయం అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ఈ సాయం కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆఫ్ లైన్‌, ఆన్‌ లైన్‌‌లతో పాటు నేరుగా మొత్తం ఇందుకోసం 1,75,218 దరఖాస్తుల వచ్చాయి.

అలాగే జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రతీ ఇంట్లోని వ్యక్తులకు కంటికి సంబంధించి ప్రభుత్వం అమలు చేయబోతున్న కార్యక్రమం ‘వైఎస్ఆర్ కంటి వెలుగు’. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 10వ తేదీన అనంతపురం జిల్లాలో సీఎం జగన్ ప్రారంభిస్తారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహిస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.560 కోట్లు కేటాయించింది. 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలకు కంటి పరీక్షలు, ఆధునిక వైద్యం అందిస్తారు.

ఇక జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకుని వచ్చిన మరో పథకం ‘వైఎస్ఆర్ రైతు భరోసా’ ఈ పథకం ద్వారా రూ.12వేలు రైతులకు అందించనుంది ప్రభుత్వం. ప్రతి రైతు కుటుంబానికి ఈ పథకం వర్తింపజేస్తూ విధివిధానాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం అక్టోబర్ 15న అమలు కానుంది.