గుండె బరువెక్కుతుంది : అమ్మను కాలేనని ఆవేదనతో ఆత్మహత్య 

అమ్మ..అనే మాట కోసం ఏ మహిళ అయినా ఆరాపడుతుంది.  మహిళ జీవితంలో అమ్మ.. అనే మాట పిలుపుతోనే పరిపూర్ణమవుతుంది.

10TV Telugu News

అమ్మ..అనే మాట కోసం ఏ మహిళ అయినా ఆరాపడుతుంది.  మహిళ జీవితంలో అమ్మ.. అనే మాట పిలుపుతోనే పరిపూర్ణమవుతుంది.

అమ్మ..అనే మాట కోసం ఏ మహిళ అయినా ఆరాపడుతుంది.  మహిళ జీవితంలో అమ్మ..అనే మాట పిలుపుతోనే పరిపూర్ణమవుతుంది. వివాహం అయినప్పటి నుంచి గర్భం దాల్చిన ప్రతీ మహిళ ఆ పిలుపు కోసం వేయి కళ్లతో వేచి చూస్తుంది. ఇల్లంతా బిడ్డ బోసి నవ్వులతో నిండిపోవాలని కలలు కంటుంది. గర్భంలోని బిడ్డ ఒడిలోకి వచ్చిన ఆ శుభ సమయం ఆ తల్లికి మరపురాని పండుగ రోజు. బిడ్డ చిట్టి చేతులతో గుండెలపై కొడుతుంటే ఆ స్పర్శను ఎంతో హాయిగా అనుభవిస్తుంది. తనివితీరా ఆస్వాదిస్తుంది.

ఆ బిడ్డ నోటి వెంట పలికే తొలి పలుకు అమ్మ. అమ్మ అనే ఆ పిలుపుకోసం జీవితాంతం తపించిపోతుంది. కానీ ఆ పిలుపు వినే అవకాశం తనకు లేదని తెలిస్తే ఆమె గుండె తట్టుకోగలదా? జీవించగలదా? కడుపు పండాలని పండంటి బిడ్డను ఎత్తుకోవాలని పడిన ఆమె ఆరాటం ఎండమావిగా నిలిచిపోయింది. బిడ్డల కోసం ఎదురు చూసి చూసి..చివరకు ఆత్మహత్య చేసుకున్న ఓ మహిళ కథ వింటే ఎంతటివారికైన కంట నీరు కారిపోతుంది. 
 
పేగు బంధం మాధుర్యాన్ని చూడాలని ఎంతో ఆశపడింది. ఒడిలో చిన్నారి ఆడుకుంటుంటే చనుబాలు ఇస్తూ మురిసిపోవాలని భావించింది. కానీ విధి ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా గర్భం నిలవకపోవడంతో.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.తల్లిగా జీవితం పరిపూర్ణం చేసుకోవాలనే ఆశ తీరదని తెలిసి తల్లడిల్లిపోయింది. ఐదుసార్లు గర్భస్రావంకావడంతో స్వాతి అనే మహిళ తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది స్వాతి. 

ఆత్మహత్య చేసుకునేముందు తన అత్తమామలు కారణం కాదని, వారు దేవతలనీ..తన భర్త నిజంగా బంగారమేనని సూసైడ్ నోట్ లో రాసింది. మరో జన్మలో కూడా అతడే తనే భర్త కావాలని కోరుకుంది. ఎప్పుడు చలాకీగా లేడిపిల్లలా ఉండే స్వాతి మృతి ఇటు అత్త..అటు పుట్టింటిలోను తీరని శోకాన్ని మిగిల్చింది. అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన నారాయణకు,స్వాతికి ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వారి కాపురం అన్యోన్యంగా సాగిపోయేది. ఈ క్రమంలో పెళ్లైన కొత్తలో గర్భం దాల్చింది స్వాతి, కానీ అబార్షన్ అయ్యింది. ఇలా ఐదేళ్ల కాలంలో ఐదుసార్లు అబార్షన్ కావటంతో ఇక తనకు పిల్లలు పుట్టరనే మనస్థాపంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది స్వాతి.

×