విశాఖలో వైద్యం కోసం 20కిలో మీటర్లు నడిచిన గర్భిణీ: తల్లీ, బిడ్డ మృతి

  • Published By: vamsi ,Published On : August 26, 2019 / 06:39 AM IST
విశాఖలో వైద్యం కోసం 20కిలో మీటర్లు నడిచిన గర్భిణీ: తల్లీ, బిడ్డ మృతి

ఓ వైపు విద్యా వైద్యంలకే మా అధిక ప్రాధాన్యత అని ప్రభుత్వాలు మాటలు చెబుతుంది. అయితే మన్యం ప్రాంతాల్లో మాత్రం ఇంకా అటువంటి పరిస్థితులు ఏ మాత్రం తగ్గట్లేదు. సరైన రోడ్లు లేక వైద్యం చేయించుకునే పరిస్థితులు లేక గర్భిణీలకు వైద్యం అందక చనిపోతూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు చూసి మా బతుకులు మారిపోతాయి అనుకున్న వాళ్లు.. నిండు ప్రాణాలను వదిలేస్తున్నారు.

లేటెస్ట్ గా సకాలంలో వైద్యమందక రెండు నిండు ప్రాణాలు బలైపోయిన ఘటన విశాఖ జిల్లా పెదబయలు మండలం జమదంగిలో చోటుచేసుకుంది. వైద్యం కోసం కొండ ప్రాంతాల్లో 20 కిలో మీటర్లు నడిచి ఓ మహిళ చివరకు ప్రాణాలను వదిలేసింది. వివరాల్లోకి వెళ్తే.. జమదంగి ప్రాంతానికి చెందిన లక్ష్మి (28) అనే నిండు గర్భిణీ చికిత్స కోసం జమదంగి నుంచి జి.మాడుగుల మండలం బొయితిలో ఉన్న ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఇందుకోసం 20కిలో మీటర్లు నడిచింది.

చికిత్స చేయించుకున్న అనంతరం మళ్లీ గ్రామానికి తిరుగుపయనం అయిన లక్ష్మీకి.. మార్గ మధ్యంలో నొప్పులు వచ్చాయి. దీంతో బందువులు ఓ కర్రకు డోలి కట్టి ఆ డోలీలో ఆమెను భుజాలపై మోసుకుని తీసుకుని వెళ్లారు. అయితే ఇంటికి తీసుకుని వెళ్లిన తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం అవ్వడంతో చనిపోయింది. 5రోజుల క్రితం జరిగిన ఈ ఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది.

ఇంట్లో తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లీబిడ్డ ఇద్దరూ చనిపోయారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ సిబ్బంది బాధిత కుటుంబ వివరాలను అడిగి తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. ఈ ఘటనపై వైద్యాధికారులు మాత్రం స్పందించలేదు.